పాదయాత్ర ముగింపు తేదీ ప్రకటించిన వైసీపీ.. 2019లో జగన్ కల నెరవేరుతుందా?

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ ‌రెడ్డి 2017 నవంబర్ ఆరున ప్రారంభమైన ప‍్రజా సంకల్పయాత్ర ఈ నెల 9వ తేదీన ముగియనుంది. ఈ నెల 9న ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది. 3500 కిలోమీటర్లకు పైగా నడిచిన జగన్ 136 నియోజకవర్గాలను చుట్టేశారు. 13 జిల్లాల్లో వందల సభలు, సమావేశాల్లో, 42 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

పాదయాత్ర అనంతరం మిగిలిన నియోజకవర్గాల్లో జగన్ పర్యటిస్తారు. 2018 జగన్నామ సంవత్సరంగా మిగిలిపోతుందని పార్టీ సీనియర్ నేత సజ్జల తెలిపారు. జనవరి రెండు నుంచి పార్టీ నేతలు, కేడర్ ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు. నియోజకవర్గాల్లో రోజూ రెండు గ్రామాల్లో స్థానిక నేతల పర్యటన ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ పథకాలపై నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తారని వెల్లడించారు.

 

ఏడాదికి పైగా సాగిన పాదయాత్రలో జగన్ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రైతులతో రోజూ మాట్లాడారు. అన్ని చేతి వృత్తుల వారిని పలకరించారు. అన్ని వయస్సుల వారినీ కలుసుకున్నారు. అన్ని మతాలు, వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. జనం ఆయనకు అడుగడుగునా నీరాజనం పలికారు. అన్ని నియోజకవర్గాల్లోనూ బ్రహ్మరథం పట్టారు. జగన్‌ను కలుసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. ఎండ, వాన, చలి… దేన్నీ లెక్క చేయకుండా జగన్ తన పాదయాత్ర కొనసాగించారు. అన్నింటినీ మించి ప్రతి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.

తన పాదయాత్ర ద్వారా జగన్ టీడీపీ సర్కారును తూర్పారబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని పట్టుబట్టారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని బలంగా వాదించారు. ఏపీకి ప్రత్యేక హోదా నినాదం దేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు.

తన పాదయాత్రలో సహకరించినవారందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

పాదయాత్ర ద్వారా 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శక్తిమంతమైన నేతగా ఎదిగి ప్రజల ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయ్యారు. సంక్షేమ కార్యక్రమాలతో, సుపరిపాలనతో 2009లోనూ తిరిగి సీఎం అయ్యారు.

రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్‌మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్‌సిపిని స్థాపించారు. ఏడాదిగా ప్రజాసంకల్ప యాత్రను చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు. తండ్రి తరహాలో జగన్ కూడా ప్రజల ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అవుతారని వైసీపీ శ్రేణులు విశ్వాసంగా ఉన్నాయి.

—దీప్తి పిక్కిలి, జర్నలిస్ట్, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*