టీడీపీతో పొత్తుపై మౌనం వీడిన జనసేనాని.. చంద్రబాబుకు భారీ ఝలక్!

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తామెవరితోనూ కలిసేది లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామంటూ గురువారం తేల్చి చెప్పారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేసింది. రానున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ కలవబోమని, అటువంటి ఆలోచన కూడా లేదని పవన్ స్పష్టం చేశారు. వామపక్షాలతో మాత్రమే కలిసి వెళ్తామని కుండబద్దలుగొట్టారు. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లోనూ జనసేన పోటీచేస్తుందని తెలిపారు. ఎన్నికల కోసం మాత్రమే జనసేన రాలేదని పేర్కొన్న పవన్ పాతిక తరాల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కోసం పోరాడేందుకు వచ్చిందన్నారు. యువత ఆశయాలను, ఆడపడుచుల ఆకాంక్షలను అర్థం చేసుకుని ముందుకు వెళ్తామని పునరుద్ఘాటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నాటి పరిస్థితుల దృష్ట్యా 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు పవన్ తెలిపారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు. మొత్తం 175 స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. అధికార పక్షంతో కానీ, ప్రతిపక్షంతో కానీ కలిసే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. అధికార, ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని, వాటిని ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపెట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ ఇటీవల వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు తాము పవన్‌తో కలిస్తే ఆయనకొచ్చిన బాధ ఏంటని ప్రశ్నించి కొత్త చర్చకు తెరలేపారు. బాబు వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు వ్యాఖ్యలపై ఇప్పటి వరకు మౌనం వహించిన పవన్ తాజాగా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి ఊహాగానాలకు తెరదించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*