
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్‌లు సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 622/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
చతేశ్వర్ పుజారా ఏడు పరుగుల తేడాతో కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా, రిషభ్ పంత్ కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు. పుజారా 193 పరుగుల వద్ద నాథన్ లయన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు హనుమ విహారి (42) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. క్రీజులోకి వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పనిచెప్పాడు. మొత్తం 189 బంతులు ఎదుర్కొన్న పంత్ 15 ఫోర్లు, సిక్సర్‌తో 159 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 81 పరుగులు చేశాడు.
ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 4 వికెట్లు పడగొట్టగా, జోష్ హేజెల్‌వుడ్ 2, మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీసుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మార్కస్ హ్యారిస్(19), ఉస్మాన్ ఖావాజా(5) క్రీజులో ఉన్నారు.
Be the first to comment