ఆసీస్ గడ్డపై రికార్డు సృష్టించిన కోహ్లీ సేన.. సిరీస్‌ 2-1తో కైవసం

ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన రికార్డు సృష్టించింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఫలితంగా ఆసీస్ గడ్డపై సిరీస్ విజయాన్ని అందుకున్న తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతేకాదు, ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుచుకున్న తొలి ఆసియా కెప్టెన్‌గానూ కోహ్లీ రికార్డులకెక్కాడు.

నాలుగో రోజు ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించిన వరుణుడు ఐదో రోజూ కూడా తన ప్రతాపాన్ని చూశాడు. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోరు సాధించింది. చతేశ్వర్ పుజారా అద్భుతంగా ఆడి 193 పరుగులు చేసి ఏడు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. చివర్లో రిషభ్ పంత్ ధనాధన్ బ్యాటింగ్‌తో 159 పరుగులు చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. రవీంద్ర జడేజా 81, మయాంక్ అగర్వాల్ 77, హనుమ విహారీ 42 పరుగులు చేశాడు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 622/7 వద్ద డిక్లేర్ చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 300 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 322 పరుగులు వెనకబడిన ఆసీస్‌కు కోహ్లీ ఫాలో ఆన్ ఇచ్చాడు. నాలుగో ఆ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. భారత్ విజయం ఖాయమని భావిస్తున్న తరుణంలో భారత్ ఆశలకు వరుణుడి రూపంలో అడ్డుకట్ట పడింది. ఐదో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైంది.

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. సెంచరీ వీరుడు చటేశ్వర్ పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు రెండూ చటేశ్వర్ పుజారాకు దక్కాయి. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఈ నెల 12న సిడ్నీలో తొలి వన్డే జరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*