
హైదరాబాద్: స్వామీ వివేకానంద 156వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణా మఠంలో యువజనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల పది నుంచి 12వరకూ యువత కోసం అనేక కార్యక్రమాలు చేపడ్తున్నారు. తొలిరోజు యువకుల కోసం శ్రద్ధ పేరుతో యూత్ క్యాంప్ నిర్వహించారు. ఐదు వందల మందికి పైగా యువకులు ఈ క్యాంప్‌లో పాల్గొన్నారు. డెక్స్ గ్లోబల్ వ్యవస్థాపకులు శరద్ సాగర్ ప్రసంగించారు. యువతలో స్ఫూర్తి నింపారు. స్వామి బుద్ధిదానంద మాట్లాడుతూ యువత ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండాలని, అందుకోసం తీవ్రంగా యత్నించాలని పిలుపునిచ్చారు. ఈనెల 11న యువతుల కోసం యూత్ క్యాంప్ నిర్వహిస్తున్నారు.
ఈ నెల 12న జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న స్వామీ వివేకానంద విగ్రహం దగ్గర్నుంచి ఉదయం 9 గంటలకు అవేక్ ఇండియా వాక్ నిర్వహిస్తున్నారు. ట్యాంక్‌బండ్ నుంచి ఆర్కే మఠ్ వరకూ సాగే ఈ నడకలో యువతతో పాటు పాఠశాలల విద్యార్ధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం పదిన్నరకు ఆర్కే మఠ్‌లో యూత్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. వివేకానంద ఆడిటోరియంలో ఛానెలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్ థీమ్‌పై కన్వెన్షన్ నిర్వహిస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరౌతున్నారు. హైదరాబాద్ రామకృష్ణా మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానానందతో పాటు పాట్నా డెక్స్ గ్లోబల్ వ్యవస్థాపకులు శరద్ సాగర్, సాధువులు ప్రసంగిస్తారు. “స్వామి వివేకానంద 125వ చికాగో ఉపన్యాస ఉత్సవాలు కూడా కొనసాగుతున్న యువత కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామీ బోధమయానంద తెలిపారు.
Be the first to comment