
అగ్రిగోల్డ్ సంస్థ కోన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసి లక్షల మంది నెత్తిన శఠగోపం పెట్టింది. అయితే… చుక్కల్లో చంద్రుడిలా కొంతమందికి మాత్రం ఇచ్చిన మాట మేరకు కొన్ని చోట్ల భూములను వారికి రిజిస్ట్రేషన్లు. చేసింది… కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కూడా అదే విధంగా 2013 వరకు 221 మందికి ప్లాట్లు కేటాయించి వారికి ఇచ్చేసింది. తాజాగా ఈ భూములు మావి అంటూ తెలుగుదేశం నేత గొర్రెపాటి గోపిచంద్ కుటుంబీకులు స్థలం వద్దకు రావడంతో వివాదం ప్రారంభమైంది. విషయం తెలుసుకున్న ప్లాట్లు కొనుగోలు చేసిన అగ్రిగోల్డు ఖాతాదారులు వెంటనే అక్కడకు వచ్చి గోపిచంద్ కుటుంబీకులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాము 2008లోనే ఈ భూములు కొనుగోలు చేసామని గోపిచంద్ కుటుంబీకులు చెపుతున్నారు. ఎవరిది వాస్తవమో… ఎవరిది అవాస్తమో రెవిన్యూ పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ చేస్తే కాని విషయం బయట పడదు. కానీ,… అగ్రిగోల్డ్ సంస్థ అందరిని మోసం చేసిన మాట మాత్రం వాస్తవం. ఆ ముసుగులో అధికార పార్టీని అడ్డం పెట్టుకుని కొంతమంది తమ భూములు కాజేయాలని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. నిజానిజాలను నిగ్గుతెల్చేందుకు తెలుగుదేశంలోని పెద్దలు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్నికల సమయం… ఏమాత్రం తేడా పడినా అసలకు ఏసరు వస్తుంది. రాష్ట్రంలో అగ్రి గోల్డ్ బాధితుల సంఖ్య చాలా పెద్దది. బందరు వ్యవహరమే కదా.. అని వదిలేస్తే… అది అందరికి చుట్టుకుంటుంది. తెలుగుదేశం నేతల్లారా తస్మాత్ జాగ్రత్త. న్యాయం ఎవరి పక్షాన ఉంటే వారికి వెంటనే న్యాయం చేయండి. మీనమేషాలు మాత్రం లెక్కించకండి.
Be the first to comment