చాహల్ దెబ్బకు ఆసీస్ కుదేలు.. 230 పరుగులకు ఆలౌట్

సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక వన్డేలో భారత బౌలర్లు దుమ్ము రేపారు. భారత్‌తో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన యుజ్వేంద్ర చాహల్ బాల్‌తో రెచ్చిపోయాడు. పది ఓవర్లలో 42 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

టాస్‌కు తొలుత వర్షం అడ్డంకిగా మారింది. రెండు బంతులు పడ్డాక మళ్లీ వర్షం మొదలు కావడంతో ఆట నిలిచిపోయింది. కాసేపటికి వర్షం తగ్గాక తిరిగి ఆట మొదలైంది. ఆసీస్‌ బ్యాటింగ్ ఆర్డర్‌ను టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి దెబ్బ కొట్టాడు. 8 పరుగుల వద్ద ఓపెనర్ అలెక్స్ కేరీ(5)ని పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ అరోన్ ఫించ్‌‌ (14)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖావాజా (34), షాన్ మార్ష్ (39) కాసేపు పోరాటం చేసినప్పటికీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాయాజాలం ముందు నిలవలేకపోయారు. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (58) ఒక్కడే చాహల్‌ను కాసేపు ప్రతిఘటించాడు. బౌలర్ల వీర విజృంభణతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ 50 ఓవర్లు కూడా పూర్తిగా క్రీజులో నిలవలేకపోయారు. 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైన కంగారూలు భారత్ ముందు 231 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచారు. భారత బౌలర్లలో చాహల్ 6 వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*