
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇప్పుడు ఈ-కామర్స్ రంగంపై దృష్టిసారించారు. చమురు, టెలికం రంగాల్లో అద్భుతాలు సృష్టించిన ఆయన త్వరలోనే ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించారు. జియో-రిలయన్స్ రిటైల్ కలిసి సరికొత్త ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తాయని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ‘ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సు’లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా తొలుత గుజరాత్‌లోని 12 లక్షల మంది రిటైలర్లు, స్టోర్ యజమానులను ఈ ఫ్లాట్‌ఫాంలోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
రిలయన్స్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అందుబాటులోకి వస్తే ఈ రంగంలో ఇప్పటికే ఉన్న అమెరికా దిగ్గజ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ ఇండియా, ఆ దేశానికే చెందిన మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం రిలయన్స్ జియోకు 28 కోట్ల మంది వినియోగదారులున్నారు. రిలయన్స్ రిటైల్ సంస్థకు దేశంలోని 6,500 నగరాలు, పట్టణాల్లో దాదాపు పదివేల విక్రయ కేంద్రాలున్నాయి. గుజరాత్ సదస్సులో పాల్గొన్న ముకేశ్ అంబానీ వివిధ రంగాల్లో ఆ రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్టు వివరించారు.
Be the first to comment