రాజకీయ దుమారం రేపుతోన్న వంగవీటి రాధా

విజయవాడ: వంగవీటి రంగా తనయుడు వంగ‌వీటి రాధా పేరు కొంతకాలంగా విజయవాడతో పాటు ఏపీ రాజ‌కీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నుంచి వైసీపీ త‌రపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన రాధా.. తాజాగా ఆ పార్టీని వీడారు. అయితే ఎటువంటి ఆంక్ష‌లు లేని ప్రజాజీవితంలో కొన‌సాగ‌ల‌నేది త‌న ఆశ‌య‌మ‌ని, అందుకే తాను వైకాపాలో చేరాన‌ని, కానీ వైకాపాలో అది సాధ్యం కాక., పార్టీకి రాజీనామా చేశానని ప్రెస్‌మీట్ లో తెలిపారు.

త‌న‌ను సొంత త‌మ్ముడిగా చూసుకుంటానన్న వైకాపా అధినేత జ‌గ‌న్ క‌నీసం సామాన్య మ‌నిషిగా కూడా గుర్తించ‌లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న తండ్రి ఆశ‌య‌మైన‌ ప్ర‌జాసంక్షేమం కోస‌మే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఎన్నో ఇబ్బందులు ప‌డుతూ, అవ‌మానాలు ఎదుర్కొంటూ.. వైసీపీలో కొన‌సాగాన‌ని రాధా తెలిపారు. పార్టీల‌క‌తీతంగా ఎంతోమంది అభిమానించే త‌న తండ్రి వంగ‌వీటి రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్ల‌టానికి తాను ఎవ‌రీ అనుమతి తీసుకోవ‌క్క‌ర్లేద‌ని అన్నారు. అయినా కూడా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఎందుకు వెళ్లావంటూ వైకాపా అధ్యక్షుడు జగన్‌ స్వయంగా త‌న‌కు ఫోన్‌ చేసి మందలించారని రాధా మీడియా ముందు వెల్ల‌డించారు.

కేవ‌లం తండ్రి లేనివాడివ‌నే జాలి చూపించి త‌న‌ను పార్టీలో ఉండ‌నిస్తున్న‌ట్లు జ‌గ‌న్ అన్నార‌ని, ప‌దే ప‌దే త‌న గుప్పిట్లో ఉంచేందుకు త‌న‌పై ఒత్తిడి చేసేవార‌ని రాధా అన్నారు. రంగా చ‌నిపోయి 30 సం.లు అయినా త‌న అభిమానులు ఆయ‌న్ను దేవుడిలా భావించి ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని, ఆ విష‌యాన్ని జ‌గ‌న్ రెడ్డి అర్ధం చేసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న ప‌ద్ధ‌తి మార్చుకొని రంగా అభిమానుల్ని గౌర‌విస్తే బాగుంటుంద‌ని చెప్పారు.

తాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక వైసీపీలోని కొంత‌మంది నేతలు త‌న‌ను చంపేస్తామని సోషల్‌ మీడియా ద్వారా బెదిరిస్తున్నార‌ని, అయితే తాను అలాంటి బెదిరింపుల‌కు భయపడేవాడిని కాదని, తనకు ప్రాణం కంటే తన తండ్రి ఆశయం ముఖ్యమని ఈ సంద‌ర్భంగా తెలిపారు. భ‌విష్య‌త్తులో తాను ఏ పార్టీలో చేరినా.. త‌న తండ్రి ఆశ‌యాల‌కు అనుగుణంగానే ప‌నిచేస్తాన‌ని మీడియా స‌మావేశంలో అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*