సేవలో తరించిన ఆర్ఎస్ఎస్ నేతకు భారత రత్న

హైదరాబాద్: మరాఠ్వాడాలోని పర్భనీ జిల్లాలోని కడోలీ గ్రామంలో 11 అక్టోబర్ 1916 లో నానాజీ దేశ్‌ముఖ్ జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రాజాబాయి, తండ్రి అమృతరావ్ దేశ్‌ముఖ్. మరాఠ్వాడా ప్రాంతంలోని కరువును చూసి చిన్నతనంలోనే నానాజీ చలించిపోయారు. అంతేకాకుండా తన కుటుంబ పరిస్థితులు కూడా ఆయన్ని కుంగదీశాయి. తన కుటుంబం కోసం, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరక తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషాదాన్ని చూసి చలించిపోయిన తండ్రి కూడా చనిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలోకి నానాజీ నెట్టివేయబడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక మహానుభావుడు ఆయన్ని సేవాతత్పరత వైపు మళ్లారు. పరోపకార చింతనతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వైపు నడిచి, ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటూ దేశానికి సేవలందించారు. అంతేకాకుండా ఉత్తరాదిన సంఘను బలోపేతం చేశారు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు. బాలల బుద్ధి వికాసానికి, భారతీయ జీవనంతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో శ్రీ సరస్వతీ శిశు మందిరాలను స్థాపించారు. మరోవైపు గాడితప్పిన వ్యవస్థ గతిని మార్చారు. జయప్రకాశ్ నారాయణ్‌కి చాలా దగ్గరగా ఉండి అన్నీ తానై నడిపించారు. భిన్న ధృవాలైన విపక్షాలను ఏకతాటిపై నడిపి ఢిల్లీలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నెలకోల్పగలిగారు. తర్వాత వారి జీవితం మొత్తం గ్రామీణ పేదల సమాజ సేవ కోసమే వెచ్చించారు. ‘చిత్రకూట్’ పథకం ద్వారా గ్రామీణ స్వయంపోషక ఆర్థిక సమాజాన్ని సృష్టించారు. ప్రభుత్వ పథకాలు కానీ, సమాజ సేవ ఫలితాలు కానీ చివరి వ్యక్తి వరకూ చేరాలని దీనదయాళ్ ఉపాధ్యాయ ధ్యేయమే స్ఫూర్తితో సేవ పేదల వరకూ చేరేట్లు జీవితాంతం కృషి చేశారు.

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆరెస్సెస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ రామ్ బలిరామ్ హెడ్గేవార్ నానాజీని చేరదీసి ఆయన జీవితాన్ని తీర్చిదిద్దారు. ఆరెస్సెస్ ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయ తీసుకోవడంతో రాష్ట్రధర్మ, పాంచజన్య అనే పత్రికలకు అటల్ బిహారీ వాజ్‌పాయ్ సంపాదకులుగా ఉంటే, నానాజీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో భారతీయ జీవన శైలిని అలవర్చడానికి మనదైన విద్యావిధానం ఆవశ్యమని నానాజీ గ్రహించారు. అందుకే విద్యార్థులకు బాల్యంలోనే బీజాలు వేయాలని నిశ్చయించుకొని ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మొట్టమొదటి శ్రీ సరస్వతీ శిశుమందిరాన్ని ప్రారంభించారు. అదే నేడు శాఖోపశాఖలై, విరాట్ శాఖలై దేశమంతా వ్యాపించి విద్యా రంగంలో తనదైన ముద్రను వేస్తున్నాయి. వీటితో పాటు నానాజీ దేశ్‌ముఖ్ రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్రను వేశారు. జనసంఘ్‌ని ప్రారంభించిన వారిలో నానాజీ కూడా ఒకరు. కాంగ్రెస్ ఏకపక్ష పాలనకు తెరదించడానికి సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియాతో అలాగే చౌదరీ చరణ్ సింగ్‌తో కూడా పొత్తు కలిపి పోటీ చేశారు. 1967 యూపీ అసెంబ్లీ ఈ కొత్త కూటమి విజయ దుందుభీ మోగించారు. ఈ పాచిక వెనుక నానాజీ దేశ్‌ముఖ్ మేధ ఉంది. ఆ తర్వాత వివిధ పక్షాలతో కలిసి జనతా పార్టీని స్థాపించారు. అయితే రాజకీయ నాయకుల అనారోగ్య నిర్ణయాలు, రాజకీయాలతో విసుగుచెంది అప్పటి నుంచి పూర్తిగా గ్రామీణాభివృద్ధి వైపే ఆయన పథం సాగింది.

1979 లో యూపీలోని కరువు నేల గోండాలో నానాజీ తన పాదాన్ని మోపారు. అక్కడి దుర్భర పరిస్థితులను చూసి నానాజీ మనసు చలించిపోయింది. దీంతో మొదటగా నానాజీ కొన్ని వేల గొట్టపు బావులను తవ్వించి రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపారు నానాజీ. ఫలితంగా అక్కడ కరువు వలసలు ఆగిపోయాయి. గ్రామ వికాసానికి ఓ గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పారు. ఆ తర్వాత చిత్రకూట్ ప్రాంతంలోని లో ప్రజలకు ప్రకృతి గురించి అవగాహన కోసం 1999 ‘చిత్రకూట గ్రామోదయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రామీణ విశ్వవిద్యాలయంగా ఖ్యాతి గడించింది. దానికి వారే ఛాన్సలర్‌గా ఉండి పూర్తి బాధ్యతలను మోశారు. ఈ ప్రాంతంలో ఆయన చేసిన కృషి అద్భుత ఫలితాలనిచ్చాయి. పూర్తిగా స్వయం ఆర్థికం వైపు నడిపించారు. దీనిద్వారా స్వరాజ్య భావనను ప్రజల్లో నెలకొల్పారు. అంతేకాకుండా వాటర్‌షెడ్‌లను నిర్మించి రైతులను అభివృద్ధి పథం వైపు దూసుకెళ్లేట్లు చేశారు. తన తుదిశ్వాస వరకు కూడా గ్రామీణ భారతాన్ని నూతన పథంలో ఆవిష్కరింప చేసిన మహోన్నతుడు నానాజీ దేశ్‌ముఖ్. ఈ సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ను నానాజీ దేశ్‌ముఖ్‌కి కేటాయించడమంటే గ్రామీణ భారతాన్ని మనకి మనం పురస్కరించుకొన్నట్లే.

శ్రీనాథ్, జర్నలిస్ట్, హైదరాబాద్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*