నేను తీసింది బంగారం.. మీరు చూసేది వెండి

గణతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదలైన ” మణికర్ణిక. ది క్వీన్ ఆఫ్ ఝూన్సీ” చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకొంటుంది. అయితే ఈ చిత్రానికి తొలుత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌న తెలుగు డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి కొన్ని కార‌ణాల వల్ల ఆ సినిమా నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన కంగ‌నారనౌత్ వ‌ల్ల వ‌చ్చిన విబేధాలే అందుకు కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో మీడియాలో వార్తలోచ్చాయి. అయితే తాజాగా ఈ విష‌యంపై క్రిష్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.

నిజానికి తాను ఓ బంగారం లాంటి సినిమా తీశానని, కాని ఇపుడు ప్రేక్ష‌కులు చూస్తున్న‌ది కేవలం వెండి అని వారికిచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రం గురించి నిర్మాత‌లు త‌న‌ను సంప్ర‌దించిన‌పుడు.. ఝూన్సీ ల‌క్ష్మీభాయి పాత్ర‌లో కంగనను ఎంచుకుందామ‌ని తెలిపార‌న్నారు. కంగ‌న అయితేనే ఆ పాత్ర‌కు త‌గిన న్యాయం చేస్తుంద‌ని, కేవ‌లం ఆమె కోస‌మే ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నానన్నారు. తాను ఈ చిత్రం కోసం 400 రోజులు కేటాయించి కష్టపడి సినిమా పూర్తిచేశాన‌ని తెలిపారు.

అయితే షూటింగ్ స‌మ‌యంలో సినిమాలోని కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను కంగ‌నా తొలగించాల‌ని ప‌ట్టుబ‌ట్టింద‌ని, అందుకు తాను ఒప్పుకోలేదని అన్నారు. చ‌రిత్ర ఆధారంగా సినిమా తీసి.. అందులో ఉన్న నిజాల‌ను చూపిద్దామ‌నుకుంటే.. కంగ‌న మాత్రం చరిత్రను విస్మరించాలని చూశారన్నారు. సినిమాలోని ప్ర‌ధానాంశ‌మైన తాంతియా తోపే పాత్ర‌ను చిత్రీక‌ర‌ణ త‌ర్వాత తొల‌గించేశార‌ని, సినిమా నుంచి త‌ప్ప‌కున్న త‌ర్వాత ఈ విష‌యం తెలిసి చాలా బాధ ప‌డ్డాన‌ని క్రిష్‌ అన్నారు. ఈ సినిమాని 70 శాతం వ‌రకు తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ట్టు చెప్పుకుంటున్న కంగ‌నా మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని, ఆ విష‌యంలో ఆమె క‌ల‌గంటున్నారేమో అని అభిప్రాయ‌ప‌డ్డారు. తాను దర్శకత్వం వహించిన సన్నివేశాలనే క్లోజప్‌ షాట్‌లో కంగన దర్శకత్వం వహించినట్లు క్రిష్ చెప్పారు.

తాను సినిమాని పూర్తి చేసి కాపీని అప్ప‌గించిన త‌ర్వాత, త‌న‌కు తెలియ‌కుండా అందులో మార్పులు జ‌రిగాయ‌ని, ఆ త‌ర్వాతే కంగ‌న దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న విష‌యం తెలిసింద‌న్నారు. తాను తెరకెక్కించిన సినిమాను చూపించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదని, ఏదేమైనా సినిమాకు మంచి పేరు రావ‌డం సంతోష‌క‌రంగా ఉంద‌ని క్రిష్ ఈ సంద‌ర్భంగా అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*