ఆ కుటుంబం మారని పార్టీలు లేవు : చంద్రబాబు

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవ‌లే అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీడిపీని వీడి వైసీపీలోకి చేరగా..వైసీపీలో ఉన్న వంగవీటీ రాధా ఆ పార్టీ తనకు సరైన ప్రాధాన్యం కల్పించట్లేదని రాజీనామా చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ అల్లుడైైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరబోతున్న వార్త రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆదివారం లోట‌స్‌పాండ్‌లో తన కుమారుడు హితేశ్‌తో క‌లిసి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావూ వైకాపా అధ్యక్షుడు జ‌గన్‌తో సమావేశమయ్యారు.

స‌మావేశ అనంత‌రం ద‌గ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ … కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉండాల‌ని లేద‌ని, త‌న కుమారుడు హితేశ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌కత్వంలో పనిచేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని తెలిపారు. అంతేకాకుండా త‌న భార్య పురంధేశ్వ‌రి కూడా కొన్ని కార‌ణాలు వ‌ల్ల బీజేపీ నుంచి త‌ప్పుకుంటున్నార‌ని , ఇక‌పై ఆమె రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే త‌మ కుటుంబం వైసీపీలో చేర‌నుంద‌ని మీడియా ముందు వెల్ల‌డించారు.

అయితే ఈ విష‌యంపై స్పందించిన ఏపీ సీఎం, టీడిపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. కేవ‌లం అధికారం కోస‌మే ద‌గ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని అన్నారు. ఈరోజు త‌మ పార్టీ నేత‌ల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వహించిన ఆయ‌న .. ద‌గ్గుబాటి కుటుంబం ఆర్ఎస్ఎస్ మొదలుకొని బీజేపీ.. కాంగ్రెస్‌.. బీజేపీ.. ఇప్పుడు వైసీపీ.. ఇలా రకరకాల పార్టీలు మారారని విమర్శించారు. ఎన్టీఆర్ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీసేందుకే అప్పుడు ల‌క్ష్మీ పార్వ‌తి, ఇప్పుడు ద‌గ్గుబాటి కుటుంబం వైసీపీ గూటికి చేరుతోంద‌ని వారిపై మండిప‌డ్డారు.

ఒక‌ప్పుడు అవ‌కాశవాదంతో ఎన్టీఆర్‌ను వాడుకున్న వారంతా.. ఇపుడు వైసీపీలో చేరి ఆ మ‌హానుభావుడికి అప‌ఖ్యాతి తెస్తున్నారని విరుచుకుప‌డ్డారు. వారు చేస్తున్న‌ కుట్రలను ప్రజలు గుర్తించాల‌ని, వారికి స‌రైన గుణ‌పాఠం చెప్పాల‌ని అన్నారు. వాళ్ల డొల్లతనాన్ని ప్రజల్లో ఎండగట్టాలని నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*