హితేష్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన పురంధేశ్వరి

విజయవాడ: ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్ వైసీపీలో చేరి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పోటీ చేస్తారనే విషయంపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై ఆయన తల్లి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. హితేష్ నిర్ణయంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌కు చెప్పానన్నారు. అంతేకాదు రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నట్లు చెబితే రామ్ మాధవ్ వారించారని పురందేశ్వరి గుర్తు చేశారు.

 

స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన భర్త, కుమారుడు వైసీపీలో చేరడం, తన కుటుంబ జరుగుతున్న దాడిపై సోషల్ మీడియా వేదికగా తాజాగా భారీ ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యమైన అంశాలు ‘నేను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా? కూతురికంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరి కోల్పోయాను. ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలుసా? నా తండ్రి దివంగత ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న ఈ ఎపిసోడ్‌లో నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మళ్లీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? 2014లో నాకు బీజేపీ టిక్కెట్ దక్కకుండా టీడీపీ కుట్ర చేసిన విషయం ఎవరికైనా తెలుసా?

 

విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏమీ చేయలేదని అంటున్నవాళ్లు.. టీడీపీ అధినేత ఏం చేశారో తెలుసా? రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇవ్వడం తప్ప ఏమీ చేయలేదు. కనీసం పోలవరం గురించి కూడా అడగలేదు. నామాటలని కాదు కానీ.. ఒక్కసారి ఆ లేఖ చూడండి. బిల్లులోని ప్రతి విషయం కోసం పోరాడనని.. నేను గర్వంగా చెప్పగలను. ఈ విషయంలో కిల్లీ కృపారాణి లాంటి వాళ్లే సాక్ష్యులు.

 

ఇక కాంగ్రెస్ ప్రవేశంపై మాట్లాడదాం. పార్టీలో తాముండకూడదని టీడీపీ అధినాయకత్వం భావించినప్పుడు.. మేము ప్రజా జీవితాన్ని మర్చిపోవాలా? తన కేడర్‌ని దగ్గుబాటి కాపాడుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. నా రాజకీయ ప్రవేశం ఎలాంటి ప్రణాళిక లేకుండానే జరిగిపోయింది. దీన్నినేను దేవుడిచ్చిన అవకాశంగానే భావిస్తున్నాను.దానికి న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించాను. కానీ కాంగ్రెస్‌తో టీడీపీ కలవడం మాత్రం మొత్తం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే జరిగింది. కానీ దాన్ని నేను ఎప్పుడూ ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను.. తాత్కాలిక ప్రయోజనాల కోసం సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలు కలవొచ్చా? ఏ కుటుంబంలోనైనా భిన్న అంశాలపై భిన్నమైన అభిప్రాయాలు ఉంటుంటాయి. నా కుమారుడికి సొంత అభిప్రాయాలున్నాయి. పార్టీలో చేరడంపై నా అభిప్రాయాన్ని చెప్పాను.. తను తన నిర్ణయాన్ని తీసుకున్నాడు. హితేశ్ నిర్ణయాన్ని రామ్ మాధవ్‌కి చెప్పాను. రాజకీయాల నుంచి విరమించుకుంటున్న విషయం కూడా చెప్పాను. కానీ ఆయన దాన్ని తోసిపుచ్చారు. రాజకీయాల్లో కొనసాగాలని అన్నారు. రెండు పార్టీలకు ఈ విషయాన్ని ముడిపెట్టి చెప్పడం.. వారి ఆలోచనను తెలియజేస్తోంది. కుకట్‌పల్లి నుంచి సుహాసిని పోటీ చేసినప్పుడు.. ఆమె ఇంటికి వెళ్లి ఆశీర్వదించి వచ్చాను. ఆమె ఓడిపోయినప్పుడు ఫోన్ చేసి మాట్లాడాను. రాజకీయాలకు అతీతంగా నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవు. దయచేసి నా పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .. వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి’’

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*