పరుగులు తీస్తున్న పసిడి ధర.. 8 నెలల గరిష్టానికి బంగారం

పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండడంతో బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. బుధవారం ఏకంగా 8 నెలల గరిష్టానికి చేరుకుని పెట్టుబడులు పెట్టాలనుకునే వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఫెడ్ రేట్లల్లో మార్పులు ఉండకపోవచ్చన్న అంచనాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వంటివి పసిడి ధరలు పెరగడానికి కారణమయ్యాయి. బుధవారం ఔన్సు బంగారం ధర 0.2 శాతం పెరిగి 1,315.49 డాలర్లకు చేరింది. 2018 మే 14 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.

ఫెడరల్ రిజర్వు పాలసీ నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండడం, మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆంక్షల్ని ఉల్లంఘించిందన్న కారణంతో చైనాకు చెందిన మొబైల్ మేకర్ హువావే టెక్నాలజీస్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవడం అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంపై దృష్టి సారించారు.

దీనికి తోడు వెనిజులాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, బ్రెగ్జిట్ ఆందోళనలు కూడా పసిడి ధర పెరుగుదలకు కారణమయ్యాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయ. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 కేరట్ బంగారం ధర రూ.33,882, కాగా 22 క్యారెట్ బంగారం ధర రూ.31,680గా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*