చిగురుపాటి హత్య కేసులో మరో ట్విస్ట్.. పోలీసుల అదుపులో మేనకోడలు సికా?

హైదరాబాద్‌: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో వెలుగులోకి వస్తున్న ఒక్కో నిజంతో పోలీసులే షాకవుతున్నారు. పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. వెలుగులు చూస్తున్న ఒక్కో నిజం చూసి విస్తుపోతున్నారు.

జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేశారని, బీరు బాటిల్‌తో తలపై కొట్టి చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ఐతవరం వద్ద రోడ్డు పక్కన కారులో వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే, ఆ సమయంలో కారును నడిపింది ఎవరు? కారును అక్కడ వదిలేసిన తర్వాత అతడు ఏమయ్యాడు? అన్నది మిస్టరీగా మారింది.

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు టోల్‌గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కారులో జయరాంతోపాటు మరొకరు, లేదంటే ఇద్దరు ఉండి ఉంటారని, వారిలో ఓ యువతి కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎవరన్నదానిపై ఆరా తీస్తున్నారు. పోలీసులకు లభ్యమైన సీసీటీవీ ఫుటేజీల్లో కారును జయరాం నడపడం లేదు. ఆయన వెనుక ఇద్దరు కూర్చున్నట్టు మసకగా కనిపిస్తోంది.

జయరాం మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన పోలీసులు ఆయన బంధువులకు అప్పగించారు. విదేశాల్లో ఉన్న ఆయన భార్య, పిల్లలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు సాయంత్రానికి మరిన్న కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

జయరాం హత్య కేసులో ఆయన మేనకోడలు, ఎక్స్‌ప్రెస్‌ ఛానల్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సికా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జయరాం ఘటన తర్వాత సికా కనిపించ లేదు. దీంతో పోలీసులు ఆమె కోసం గాలించి పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. జయరాం వద్ద అకౌంటెంట్‌గా పనిచేసిన రామకృష్ణను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*