భారత పైలట్ పాక్‌లో ల్యాండయ్యాక ఏం జరిగింది?.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన అభినందన్

న్యూఢిల్లీ: మిగ్-21 బైసన్ జెట్ పాక్ గడ్డపై కూలిపోతున్న సమయంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పారాచ్యూట్ సాయంతో విమానం నుంచి సురక్షితంగా కిందికి దిగాడు. అతడిని బందీగా పట్టుకున్న పాక్ సైన్యం తొలుత దాడి చేసింది. ముఖంపై పిడిగుద్దులు కురిపించింది.

చిత్రహింసలు పెట్టి రక్షణ పరమైన రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, నెత్తురోడుతున్నా పంటిబిగువున బాధను అదిమిపెట్టుకున్న అభినందన్ తన పేరు, వివరాలు తప్ప మరే విషయాలు బయటపెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా, అభినందన్ కూలుతున్న విమానం నుంచి బయటపడిన తర్వాత ఏం జరిగిందో వివరిస్తూ పాకిస్థాన్ కు చెందిన 58 ఏళ్ల రాజకీయ, సామాజిక కార్యకర్త మహ్మద్ రజాక్ పాక్ పత్రిక ‘డాన్’లో ఓ కథనం రాశారు. రజాక్ రాసింది యథాతథంగా..

పారాష్యూట్ సహాయంతో ఇండియన్ పైలట్ ఒకరు సురక్షితంగా ల్యాండయ్యాడు. అతని వద్ద పిస్టల్ ఉంది. తాను దిగింది పాక్ భూభాగమని గ్రహించిన అతడు భారత్ దిశగా అర కిలోమీటర్ దూరం పరిగెత్తాడు. అతడిని చూసిన కొందరు యువకులు వెంబడించారు. వారిని నిలువరించేందుకు ఆ పైలట్ వారిపైకి పిస్టల్ గురి పెట్టాడు. గాల్లోకి కాల్పులు జరిపాడు.

ఆ తర్వాత పక్కనే ఉన్న చిన్న నీటి కుంటలోకి దూకాడు. తన జేబులో ఉన్న డాక్యుమెంట్లు, మ్యాప్‌లను బయటకు తీసి మింగడానికి ప్రయత్నించాడు. మరికొన్నింటిని నీటిలో ముంచి నాశనం చేయాలని చూశాడు. అదే సమయంలో అక్కడ గుమిగూడిన యువకుల్లో ఒకడు తన వద్ద ఉన్న తుపాకితో పైలట్ కాలులోకి కాల్చాడు.

దీంతో విస్తుపోయిన పైలట్ బాధతో విలవిల్లాడుతూనే ఇది ఇండియానా? లేక, పాకిస్థానా? అని వారిని ప్రశ్నించాడు. దీంతో ఓ యువకుడు ఇండియానే అని సమాధానం ఇచ్చాడు. అయితే, ఇది ఇండియాలో ఏ ప్రాంతమో చెప్పాలంటూ గట్టిగా అరిచాడు. అనంతరం నీటిలో నుంచి బయటకు వచ్చి తనను చంపొద్దని బతిమాలాడు.

నీటిలోంచి బయటకొచ్చిన పైలట్‌ను చుట్టుముట్టిన యువకులు గట్టిగా పట్టుకున్నారు. వారిలో కొందరు అతడిపై దాడిచేసి చితకబాదారు. సరిగ్గా ఇదే సమయంలో పాక్ సైనికులు అక్కడకు చేరుకున్నారు. యువకుల బారి నుంచి అతడిని రక్షించి తమ అదుపులోకి తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*