చదువంటే నాకు మా చెడ్డ చిరాకు బాబూ: పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ తన చదువుకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. చిత్తూరు జిల్లా విద్యార్ధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పవన్ మాట్లాడుతూ.. తాను పెద్దగా చదువుకోలేదని తెలిపారు. చదువుపై విసుగేసి ఇంటర్‌తోనే ఫుల్‌స్టాప్ పెట్టినట్టు చెప్పారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమో చేయడానికి ప్రయత్నించానని, అటు పిమ్మట కంప్యూటర్ సైన్స్ డిప్లమో చేశానని వివరించారు. ఆటోకేడ్ కూడా కొంతవరకు నేర్చుకున్నట్టు చెప్పిన పవన్ ఇలాంటి పిచ్చిపనులు చాలా చేశానని విద్యార్థులకు వివరించారు.

చదువు పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల్ని నాలుగుగోడల మధ్య చావగొడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత బస్‌పాస్, ఉచితంగా భోజన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బాగుండదనే విషయం వారికి కూడా తెలుసని, అందుకే వారా పనిచేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఏదైనా అనుభవపూర్వకంగా చెబితేనే వారు త్వరగా అర్థం చేసుకోగలరని చెప్పారు.

ఆపిల్ ఇలాంటి ఉంటుంది.. దానిని తింటే తియ్యగా ఉంటుందని చెప్పడం కంటే దానిని ఇచ్చి అనుభవపూర్వకంగా చెబితే ఫలితాలు ఇంకా బాగుంటాయన్నారు. కాన్సెప్ట్యువల్ అండర్‌స్టాండింగ్ చెప్పే టీచింగ్ మెకానిజాన్ని మన విద్యావ్యవస్థ చంపేసిందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఇటువంటి విధానాన్ని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలోనూ తీసుకొస్తామన్నారు.

తనకు చదువంటే మహా చిరాకుగా అనిపించేదన్న పవన్.. తన తెలివితేటలు పరీక్షించేందుకు ఎగ్జామ్స్ ప్రాతిపదిక ఎలా అవుతాయో తనకు అర్థమయ్యేది కాదన్నారు. థామస్ అల్వా ఎడిసన్, ఐన్‌స్టీన్ వంటి వారు కన్వెన్షనల్ ఫార్మాట్‌లో చదువుకోలదేని పవన్ వివరించారు. ఏ ప్రభుత్వమైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు. ఫీజులు తీసుకోకుండా ఉంటే సరిపోతుందని సూచించారు.

విద్య అనేది వ్యాపారం కాకూడదన్న పవన్.. మల్టిపుల్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ రావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నప్పుడు లైబ్రరీకి వెళ్లి ఇష్టమైనది చదువుకుందామని అనుకుంటే తాళం వేసి ఉండేదని, మరెందుకో ఆ లైబ్రరీ అర్థమయ్యేది కాదన్నారు. పోనీ, ఆడుకుందామంటే మైదానం కూడా ఉండేదని కాదని పవన్ పేర్కొన్నారు. తాను పెద్దగా చదువుకోలేదు కాబట్టి విద్యార్థులకు మరింత అండగా నిలబడగలనని పవన్ స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*