ఉన్మాది అన్వేష్ దాడిలో గాయపడిన రవళి కన్నుమూత

వరంగల్: ఉన్మాది సాయి అన్వేష్ దాడిలో గాయపడిన రవళీరావ్ కన్నుమూసింది. ఉన్మాది పెట్రోల్ పోసి తగులబెట్టడంతో కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. నిందితుడు మామునూరు పోలీసుల ముందు లొంగిపోయాడు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన తోపుచర్ల రవళీ రావ్ హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కాలేజిలో బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతోంది. గత నెల 27న తన స్నేహితురాలిని కలుసుకోవడానికి రామ్ నగర్ వద్ద ఉన్న లలితారెడ్డి హాస్టల్ కు వచ్చిన రవళిని అన్వేష్ అడ్డగించాడు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రవళి అరుపులకు బయటికి వచ్చి‌న స్థానికులు ఆమెను రక్షించే ప్రయత్నం చేయగా అవినాశ్ వారిని బెదిరించి అక్కడినుంచి పారిపోయాడు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న రవళిని స్థానికులు ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

వర్ధన్నపేట మండలం చెన్నారం‌ గ్రామానికి చెంది‌న అవినాశ్ హన్మకొండలో ‌డిగ్రీ చదువుతున్నాడు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఇటీవల అవినాశ్ పుట్టిన రోజు జరుపుకున్న తర్వాత వీరి మధ్య గొడవలు జరిగి విభేదాలు తలెత్తాయని పోలీసులు భావిస్తున్నారు. పెట్రోల్ దాడి తర్వాత అవినాశ్ నేరుగా మామునూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతే కాకుండా తన స్నేహితుల సహకారంతో ఇష్యూను డైవర్ట్ చేయడానికి తమ మధ్య ఎఫైర్‌కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేలా చేశాడు. ప్రేమోన్మాదంతో రవళిపై దాడికి పాల్పడిన అవినాశ్‌ను ఉరితీయాలని ఆమె బంధువులు కోరుతున్నారు. ఉన్మాదిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని పోలీస్ కమిషనర్ రవీందర్ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*