‘మా’ ఎన్నికలపై నటి రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవి ‘మా’ ఎన్నికల్లా లేవని, ప్రధాని నరేంద్రమోదీ-కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న పోరులా ఉందని వ్యాఖ్యానించింది. శివాజీరాజా-నరేశ్ ఇద్దరూ తమకు కావాల్సిన వాళ్లేనన్న రకుల్ ‘మా’లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ప్రముఖుల రాకతో జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ చాంబర్ కోలాహలంగా మారింది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అలీ, కృష్ణ భగవాన్‌, సాయికిరణ్‌, దాసరి అరుణ్‌కుమార్‌ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాత్రికల్లా ఫలితం తేలనుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్యానెల్ రెండేళ్లపాటు అధికారంలో ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా మళ్లీ బరిలో దిగగా.. ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు ఆయన ప్యానెల్‌లో ఉన్నారు. సీనియర్ నటుడు నరేశ్ ప్యానెల్‌లో జీవిత, రాజశేఖర్, శివబాలాజీ సహా 26 మంది ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*