సాయంత్రమే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేటి సాయంత్రం ఐదు గంటలకు షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసినట్టు సమాచారం. షెడ్యూల్ విడుదలైతే ఇప్పటికే ఊపందుకున్న రాజకీయాలు, జంపింగ్‌లు మరింత పెరిగే అవకాశం ఉంది.

నిజానికి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉందని, అయితే, ప్రధాని నరేంద్రమోదీ పర్యటనల కోసమే నోటిఫికేషన్‌ను ఆలస్యం చేస్తున్నట్టు కాంగ్రెస్ ఇప్పటికే దుమ్మెత్తి పోస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే నేడు షెడ్యూల్‌ను విడుదల చేసి ఈ నెలాఖరుకు, లేదంటే వచ్చే నెల మధ్యలో నోటిపికేషన్ విడుదల చేయనున్నట్టు సమాచారం.

మరోవైపు, ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. షెడ్యూల్ విడుదలకు ముందే అన్ని రాష్ట్రాలను చుట్టేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పర్యటించిన అన్ని రాష్ట్రాల్లోనూ వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఎడాపెడా శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలలో సుడిగాలి పర్యటనలు చేపట్టారు.

లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికలు కూడా నిర్వహించేందుకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. మొత్తం ఏడెనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం చర్చించేందుకు వచ్చే వారం ఎన్నికల పరిశీలకులు సమావేశం కానున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*