రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరిక.. ప్రచారంలో అమర జవాన్ల ఫొటోలను వాడొద్దని ఆదేశాలు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల ఫొటోలను, అందుకు సంబంధించిన ఘటనలను పార్టీలు తమ ప్రచారంలో ఉపయోగించుకోరాదని, నిబంధనలు ఉల్లంఘించే పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ విషయంలో కింది స్థాయి నేతలు అప్రమత్తంగా ఉండేలా ఆయా పార్టీల అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించి 2013లోనే జారీ చేసిన సూచనలను మరోమారు గుర్తు చేసింది.

నేటి సాయంత్రమే సార్వత్రిక ఎన్నికలకు నేటి సాయంత్రం షెడ్యూలు వెలువరించనున్న ఈసీ శనివారమే ఇందుకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల ఫోటోలను కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం వినియోగిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్న ఈ సీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల్లో యుద్ధం లాంటి అంశాలను ప్రచారంలో ప్రస్తావించడంపై ఈసీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.

ఇటీవల పాక్ సైనికుల చేతికి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభిందన్ వర్థమాన్‌ను విడుల చేయాలంటూ పాకిస్థాన్‌పై భారత్ దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇమ్రాన్ ప్రభుత్వం అభినందన్‌ను విడుదల చేయాల్సి వచ్చింది.

పాక్ చెర నుంచి భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్‌కు దేశవ్యాప్తంగా స్వాగత సత్కారం లభించింది. దీనిని అవకాశంగా మలచుకున్న బీజేపీ సీనియర్ నేత ఒకరు అభినందన్ ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లు ఏర్పాటు చేయించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. అది అటూ ఇటూ తిరిగి ఎన్నికల సంఘం దృష్టిలో పడింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*