వివేకానంద రెడ్డి హత్య

పులివెందుల: వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని పోలీసులు తేల్చారు. కడప రిమ్స్‌లో వివేకా భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తైంది. ఆయన శరీరంలో ఏడుచోట్ల బలమైన గాయాలున్నాయి. తలలో రెండువైపులా కత్తితో పొడిచిన గాయాలున్నాయి. అలాగే ఛాతిపై, చేతిపై కూడా కత్తిపోట్లు ఉన్నాయి.

అటు వివేకాది హత్యేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. హత్యకు సంబంధించి ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించామన్నారు. కొన్ని వేలిముద్రలు గుర్తించామని, అవి ఎవరివో తేల్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హత్య ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు.

అంతకుముందు వివేకా మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. బెడ్‌రూంలో ఏసీ ఉన్నప్పటికీ డోర్ ఎందుకు తెరిచి ఉందనేది అనుమానాస్పదంగా మారింది. సైడ్ డోర్ లాక్ ఎవరు తీసి ఉంటారనేదానిపై విచారణ జరిపిస్తున్నారు. ఫోరెన్సిక్‌ బృందం పులివెందులకు చేరుకోనుంది.

అటు వివేకా భౌతికకాయానికి వైసీపీ అధినేత జగన్, ఆయన సతీమణి భారతి నివాళులర్పించారు. వివేకా నివాసానికి బంధువులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకు ముందు వైఎస్‌ విజయమ్మ వివేకా కుటుంబ సభ్యులను ఓదార్చారు. కన్నీటి పర్యంతమయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*