మనోహర్ పారికర్ ఇకలేరు

పానాజీ: గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూశారు. 63 సంవత్సరాల పారికర్ కొంతకాలంగా పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. విదేశాల్లో చికిత్స పొందినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు.

పారికర్ గోవాకు మూడుసార్లు సీఎంగా పనిచేశారు. రక్షణ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. 2000-2005 వరకు, 2012-2014 వరకు గోవా సీఎంగా పనిచేశారు. 2014 నుంచి 2017 వరకూ రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 2017 మార్చి నుంచి తిరిగి సీఎంగా కొనసాగుతున్నారు.

చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారారు. ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అత్యంత నిరాడంబరంగా ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా పారికర్‌కు పేరుంది.

పారికర్ మరణంపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర నేతలు సంతాపం వెలిబుచ్చారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందంటూ నివాళులర్పించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*