రామకృష్ణ మఠం వాలంటీర్ల సేవలు భేష్

హైదరాబాద్: చికాగో విశ్వమత మహాసభలో స్వామి వివేకానంద చారిత్రక ఉపన్యాసానికి 125 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో వారాసిగూడ బౌధ్ధనగర్‌లోని నేతాజీ పబ్లిక్ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్ధులకు స్వామి వివేకానంద జీవితంలోని ప్రధాన ఘట్టాలను, భారతదేశానికి, విశ్వ మానవాళికి ఆయన ఇచ్చిన సందేశాన్ని వివరించారు. ముఖ్యంగా 1893 సెప్టంబర్ 11న చికాగో ప్రసంగంలో వివేకానందుడు చెప్పిన విషయాలను చిన్నారులకు అర్ధమయ్యేలా చెప్పారు. వివేకానందుడి స్ఫూర్తితో ఏ విధంగా తమ జీవితాలను మెరుగుపరుచుకోవచ్చో వివరించారు. స్వామి వివేకానంద సాహిత్యాన్ని విద్యార్ధులకు అందించారు.

అంతకు ముందు స్వామి వివేకానంద చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరసింహరాజు మాట్లాడుతూ రామకృష్ణ మఠం వాలంటీర్ల సేవలను కొనియాడారు. స్వామి వివేకానంద సందేశాన్ని, స్ఫూర్తిని విద్యార్ధులకు అందించేందుకు వాలంటీర్లు చేస్తున్న కృషిని అభినందించారు. వివేకానందుడి స్ఫూర్తిని నింపుకుని మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్ధులకు సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేతాజీ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఆయన అభినందించారు. స్వామి వివేకానందుడి సందేశాన్ని మరిన్ని పాఠశాలల విద్యార్ధులకు అందేలా తాను సహకారాన్ని అందిస్తానని నరసింహరాజు హామీ ఇచ్చారు.

స్వామి వివేకానంద చికాగో ప్రసంగ నేపథ్యాన్ని, వివేకానందుడి సందేశాన్ని విద్యార్ధులకు అందించేందుకు రామకృష్ణ మఠం వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో వాలంటీర్లు పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్కూల్ యాజమాన్యాల సహకారంతో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

నేతాజీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ నిరంజన్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, రామకృష్ణ మఠం వాలంటీర్లు కళ్యాణి, సుజాత, రాఘవేంద్ర, సురేంద్ర, ప్రణీత్, రోహిత, పల్లవి, నిఖిల్, యాదవ్, నారాయణ రావు పాల్గొన్నారు.

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు. త్వరలో సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహించనున్నారు.

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*