తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్.. పొంగులేటి క్విట్.. బీజేపీలోకి ఇన్!

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు మరంతగా దిగజారుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినోళ్లు, గెలవనోళ్లు అందరూ పార్టీని వీడిపోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బక్కచిక్కిన కాంగ్రెస్‌కు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తాజాగా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపారు.

మాజీమంత్రులు డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి.. సీనియర్ నేతలు రాపోలు ఆనంద భాస్కర్, చిత్తరంజన్ దాస్‌లు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోగా తాజాగా పొంగులేటి రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ అయింది.

ఇక, పార్టీకి రాజీనామా చేసిన పొంగులేటి తన రాజీనామా లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో నిజాయతీ పరులకు టికెట్లు దక్కడం లేదని, డబ్బున్న వారికే టికెట్లు లభిస్తున్నాయని ఆరోపించారు.

ప్రస్తుత ఎన్నికల్లో అదే జరుగుతోందని, ఇది చూశాక పార్టీలో ఇమడడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని వాపోయారు.

‌కాగా, కాంగ్రెస్‌కు సడెన్ షాక్ ఇచ్చిన పొంగులేటి అతి త్వరలోనే కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నేడు ఆయన ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మోదీతో భేటీ అనంతరం పొంగులేటి తన భవిష్యత్ కార్యాచరణ గురించి వెల్లడిస్తారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*