సింగపూర్ లోని తెలుగు వారికి ముందుగా వచ్చిన ఉగాది

సింగపూర్‌లో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి “శివపదం” మరియు ప్రవచనం కార్యక్రమాలు.

సింగపూర్‌లో తొలిసారిగా, మార్చి 30,31వ తేదీల్లో ఋషిపీఠం స్థాపకులు, ప్రఖ్యాత కవిపండితులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచన కార్యక్రమం మరియు “శివపదం“ నాట్యారాధనా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయంలోని పిజిపి హాల్ వేదికగా సింగపూర్‌లోని తెలుగు వారందరూ కలిసి రెండురోజుల పండుగలా జరుపుకున్నారు.

30వ తేదీ నిత్య జీవితంలో పాటించవలసిన నైతిక విలువలను గూర్చి రామాయణ భారత భాగవతాది పురాణేతిహాసాల నుండి చక్కని ఉదాహరణలతో వివరిస్తూ సామవేదం షణ్ముఖశర్మ అందించిన ప్రవచనసుధ, అన్ని వయసుల వారిని మంత్రముగ్ధులను చేసింది. హిందూ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని పరిరక్షించే విధంగా అందరూ ఆలోచించాల్సిన అవసరాన్ని ప్రెరేపించింది.

31వ తేదీ పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ సముఖంలో, ఈ కార్యక్రమం కోసం అమెరికా నుంచి వచ్చిన వాణి గుండ్లపల్లి వారి ఆధ్వర్యంలో, కూచిపూడి, భరతనాట్యం, కథక్ మరియు ఒడిస్సీ నృత్యకళా రీతులలో దివ్యమైన “శివపదం” నాట్యారాధనా కార్యక్రమం జరుగింది. భారతీయ నృత్య కళా సంస్కృతికి అద్దం పట్టే విధంగా అందరినీ సమ్మోహనపరచిన ఈ కార్యక్రమానికి స్వయంగా సామవేదం షణ్ముఖశర్మ గారే భాష్య ప్రవచనం చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలుగు పదానికి సిరిమువ్వల పాదాలు జోడై లయకారకుని లయబద్ధముగా కొలచుటకు పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి కలం నుండి జాలువారిన వేయికి పైగా పాటల సంకలనమే “శివపదం” S P బాలసుబ్రమణ్యం, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, మల్లాది సూరిబాబు, మల్లాది సోదరులు వంటి ప్రముఖ సంగీత విద్వాంసులు ఆలపించిన ఈ గీతమాలికలు ప్రఖ్యాత నాట్యకళాకారులచే ప్రపంచ వ్యాప్తంగా నృత్యరూపకాలుగా ప్రదర్శింపబడి ప్రశంసలందుకుంటున్నాయి.

సింగపూర్ కార్యక్రమంలో “శివపదం” నృత్యరూపకాలను రూపొందించిన నాట్యాచార్యులు: చిత్ర శేఖరన్, ప్రత్యూష అవధానుల, అమృతని శివహారన్, విద్యాలక్ష్మి శ్రీనాథ్, నమ్రత పడాల అక్షయ మరియు స్వర్ణ. వేదసారాన్ని, నాదబ్రహ్మగా శివతత్వాన్ని ఆవిష్కరింపజేసే ఇటువంటి సంగీత సాహిత్య నృత్య సమ్మేళనము తొలిసారిగా సింగపూర్‌లో నిర్వహింపబడడం విశేషం.

ఆంధ్రుల రాజధాని అమరావతి ఘనతను చాటుతూ అరుణ్ వేమూరి రచించిన ఒక పాటను సామవేదం సముఖంలో సింగపూర్ గాయనీ గాయకులు ఆలపించి ఆవిష్కరించుటపై ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ రెండురోజుల కార్యక్రమాలకు రత్నకుమార్ మరియు శ్రీధర్ భరద్వాజ్, నాగేంద్ర, రామాంజనేయులు, ముఖ్య నిర్వాహకులుగా రాధిక వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వాణి పద్మజ, లక్ష్మి, విద్యా భాస్కర్ తదితరులు సహకరించగా సుమారు 600 మంది తెలుగు వారు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*