పాకిస్థాన్‌ను బెంబేలెత్తించిన ఐఏఎఫ్ యువ అధికారిణి.. సంచలన విషయాన్ని బయటపెట్టిన భారత వాయుసేన

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 27వ తేదీన పాకిస్థాన్ దాడిని భారత్‌ విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ దాడి వెనుక ఐఏఎఫ్‌కు చెందిన ఓ యువ అధికారిణి ఉన్నట్టు తాజాగా వాయుసేన ప్రకటించింది. అయితే, భద్రతాపరమైన కారణాల వల్ల ఆమె పేరును బయటపెట్టలేదు. అయితే, ఇప్పటికే ఆమెను సేవాపతకానికి నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 26న భారత మిరాజ్‌2000 విమానాలు బాలాకోట్‌లోని పాక్ ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించి సురక్షితంగా వెనక్కి వచ్చాయి. భారత దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ప్రతిదాడి చేస్తుందని ముందుగానే అంచనా వేసిన వాయుసేన అప్రమత్తమైంది. ఫిబ్రవరి 27న ఉదయం పంజాబ్‌లోని ఒక వాయుసేన స్థావరంలో పైన పేర్కొన్న యువ అధికారిణి విధుల్లో ఉన్నారు. సరిగ్గా 8.45 సమయంలో పాక్‌ వైమానిక స్థావరాల్లో ఏదో జరగుతున్నట్టు ఆమె గుర్తించారు. పాక్‌ తన గగనతలంపై పౌరవిమానాల రాకపోకలను అప్పటికే నిషేధించడంతో ఆమె అనుమానం మరింత బలపడింది. అదే సమయంలో పాక్‌ వాయసేనకు చెందిన 25 యుద్ధ విమానాలు వివిధ స్థావరాల నుంచి ఒక్కసారిగా పైకి లేచాయి.

అప్పటికే అనుమానంతో ఉన్న ఆమెకు పాక్ విమానాలు గాల్లోకి లేవడంతో ఆమె అప్రమత్తమైంది. వెంటనే పీర్‌పంజాల్‌ వద్ద కాంబాట్‌ ఎయిర్‌ గస్తీలో ఉన్న రెండు మిరాజ్‌-2000, దానికి దక్షిణ భాగంలోని సుఖోయ్‌-30ఎంకేఐలకు సమాచారం అందజేసింది. అయితే, పాక్‌ యుద్ధవిమానాలు రాజస్థాన్‌ సరిహద్దుల వైపు వస్తుండటంతో అక్కడ ఉన్న భారత వాయుసేనను కూడా ఆమె అప్రమత్తం చేసింది.

పాక్‌ విమానాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు గాల్లో ఉన్న భారత పైలట్లకు చేరవేసింది. భారత విమానాల సంఖ్య తక్కువగా ఉండటంతో మిగ్‌-21బైసన్లకు కూడా ఆమె సమాచారం అందజేసింది. పాక్‌ ఎఫ్-‌16 విమానాలు అమ్రామ్‌ క్షిపణులు తీసుకొచ్చిన విషయాన్ని కూడా వారికి తెలియజేసింది. దీంతో వెంటనే భారత్‌ మిగ్‌లు పీర్‌పంజాల్‌ వైపుగా గాల్లోకి ఎగిరాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ ‘ఎయిర్‌ బార్న్‌ ఎర్లీ వార్నింగ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌’ (అవాక్‌) వ్యవస్థ గుర్తించలేకపోయింది. దీంతో భారత్‌లో ప్రవేశించిన పాక్‌ విమానాలను విస్మయానికి గురిచేస్తూ హఠాత్తుగా మిగ్‌-21లు ప్రత్యక్షమయ్యాయి

దీంతో దిక్కుతోచని పాక్‌ విమానాలు హడావుడిగా వెనక్కి మళ్లాయి. ఆ తర్వాత జరిగిన డాగ్‌ఫైట్‌లో పాక్‌ ఎఫ్‌-16 , భారత్‌ మిగ్‌-21 కూలిపోయాయి. ఐఏఎఫ్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్ పాక్‌ దళాలకు చిక్కాడు. అభినందన్‌ మిగ్‌-21లో పాక్‌ విమానాన్ని వెంబడిస్తూ సరిహద్దులు దాటడాన్ని ఆ అధికారిణి గమనించి పలుమార్లు ‘టర్న్‌ కోల్డ్‌, టర్న్‌ కోల్డ్‌’ అని హెచ్చరించింది.

కానీ అప్పటికే భారత రేడియో తరంగాలను పాక్ బ్లాక్‌ చేయడంతో ఈ హెచ్చరికలు అభినందన్‌కు చేరలేదు. పాక్ విమానాల కదలికలను గుర్తించి ఆమె కనుక అప్రమత్తం చేయకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆమె చూపిన ధైర్యసాహసాలు, విధుల్లో ఆమె చూపించిన అప్రమత్తతకు వాయుసేన సేవా పతకానికి ఆమె నామినేట్ అయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*