జెర్సీ మూవీ రివ్యూ

సినిమా మరియు క్రికెట్ భారతదేశంలో అనధికారిక మతాలుగా చలామణిలో ఉన్న అంశాలు. క్రికెట్ నేపథ్యంగా ఉండే అంశాలతో, క్రికెటర్ల జీవిత గాథలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, తెలుగులో మాత్రం గోల్కొండ హైస్కూల్ వంటి ఒకటి అరా ప్రయోగాలు మినహాయిస్తే ఆ నేపథ్యంలో ఎక్కువ సినిమాలు రాలేదు. గతంలో, కబడ్డీ నేపథ్యంతో భీమిలి కబడ్డీ జట్టు సినిమా చేసిన నానియే ఇప్పుడు క్రికెట్ నేపద్యంలో సినిమా చేయడం యాదృచ్చికం కావచ్చు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన ప్రతిభావంతుడిగా కీర్తించబడుతూ, భారత జట్టుకు ఎంపిక అవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్న అర్జున్ (నాని) కొన్ని పరిణామాల వల్ల 26 ఏళ్ళకే ఆ ఆట కి దూరం కావాల్సి వస్తుంది. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఓ చిన్న ఉద్యోగానికి (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో) ఎంపికై సంసార జీవితం గడుపుతుంటాడు. ఆ తర్వాత ఉద్యోగ జీవితంలో కూడా వచ్చిన ఓ చిన్న కుదుపు (సస్పెన్షన్) తన వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులకు దారి తీస్తుంది. మానసికంగా కుంగిపోయి, ఆర్థికంగా కుదేలైపోయి, తను ఎంతగానో ప్రేమించే తన భార్య కూడా తనను చులకన చేస్తోందని భావించి భారత జట్టుకు ఆడాలనే తన కలను సాకారం చేసుకోవడమే ఈ సమస్యలకు పరిష్కారంగా నిర్ణయించుకొని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడతాడు. అర్జున్ ఆ ప్రయత్నంలో సఫలం అయ్యాడా ? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సంఘర్షణ, అవమానాలు, అందుకున్న అభినందనలు వంటివన్నీ పెద్ద తెర మీద చూడాల్సిందే.

ఇక నటీనటుల విషయానికొస్తే భారమైన భావోద్వేగాలతో నడిచే ఈ సినిమాలో నానిది వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. రంగురంగుల కాస్ట్యూమ్స్ మరియు ఒక్క డ్యూయెట్ కూడా లేని ఇలాంటి సినిమాను ఈ వయసులో అంగీకరించినందుకు నాని అభినందనీయుడు. ఆటను వదిలేసి పూర్తిగా ఫ్యామిలీ మాన్ గా మారిపోయాక తన కుటుంబం కోసం, ప్రత్యేకించి తన కొడుకు కోరే చిన్న చిన్న కోరికలను తీర్చడానికి తను పడే తపనలో, అవి తీర్చలేకపోయే సందర్భంలో తను పడే బాధలో తన నటనతో ఒక సగటు మధ్యతరగతి మనిషిని గుర్తు చేస్తాడు. ఇక క్రికెటర్గా కూడా కొన్ని మేనరిజమ్స్ తో ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ ను మరిపిస్తాడు. చాలావరకు డీ గ్లామర్ గా ఉండే పాత్రలో నాని నుంచి మనం రెగ్యులర్ గా ఆశించే అంశాలు అంతగా దొరకవనే చెప్పాలి. నాని తర్వాత ఆ స్థాయిలో గుర్తుంచుకొనే పాత్ర పోషించింది మాస్టర్ రోహిత్. నాని కొడుకుగా చాలా సన్నివేశాల్లో ఎంత చక్కటి పరిణితితో కూడిన ప్రదర్శన కనబరిచాడు. హీరోయిన్ పాత్ర కి ప్రాధాన్యం ఉన్నప్పటికీ తను ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అర్జున్ కు మెంటర్ గా, తన ఉత్థానపతనాల్లో అండగా నిలిచే పాత్రలో సత్య రాజ్ కూడా మరొక మంచి పాత్ర పోషించాడు.

వ్యక్తిగత ,వృత్తిగత జీవితాలు రెండింట్లోనూ ఫెయిల్యూర్లో ఉన్న వ్యక్తి కథను తీసుకుని , ఆ రెంటినీ సమాంతరంగా నడిపిస్తూ సుఖాంతం చేసిన (?) దర్శకుడు గౌతం క్లైమాక్స్లో చక్కటి సందేశాన్ని కూడా మిళితం చేశాడు. సన్నివేశాలకు చక్కని సంభాషణలు, ఉత్తేజ పూర్వక నేపథ్య సంగీతం జోడించి ఒక రొటీన్ గా అనిపించే డ్రామాను (ప్రత్యేకించి సెకండాఫ్) రక్తి కట్టించాడు.

*ప్లస్ పాయింట్స్*:

1) నాని, మాస్టర్ రోహిత్ ల నటన
2) సంభాషణలు

*మైనస్ పాయింట్స్*:

1) రిపీటెడ్ అనిపించే సన్నివేశాలు
2) సెకండాఫ్ లో లోపించిన కాన్ఫ్లిక్ట్ (ప్రత్యేకించి అతని క్రికెట్ ప్రయత్నాల్లో)

*పంఛ్ లైన్* :
_జెర్సీ_ – ఒక ఎమోషనల్ జర్నీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*