వారణాసిలో నిజమాబాద్ రైతులకు షాకుల మీద షాకులు!

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బరిలోకి దిగాలని భావించిన తెలంగాణలోని నిజామాబాద్ పసపు రైతులకు అక్కడి ఎన్నికల అధికారులు షాకిచ్చారు. వివిధ కారణాలు చూపుతూ మొత్తం 24 మంది రైతుల నామినేషన్లను తిరస్కరించడం కలకలం రేపుతోంది. దీంతో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఏర్గట్లకు చెందిన సున్నం ఇస్తారి మాత్రమే బరిలో మిగిలారు.

ఎన్నికల అధికారులు తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని తీవ్రంగా పరిగణించిన రైతులు ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అసలు తమ నామినేషన్లను ఎందుకు తిరస్కరించారో చెప్పాలని డిమాండ్ చేయనున్నారు.

ప్రధానిపై రైతుల పోటీ ఎందుకంటే?

సాక్షాత్తూ దేశ ప్రధానిపై తెలంగాణ రైతులు పోటీకి దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీపై రైతులు పెద్ద ఎత్తున ఎందుకు పోటీకి దిగుతున్నారన్న ఉత్సుకత దేశ ప్రజల్లో మొదలైంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని.. ఎర్ర, తెల్లజొన్నలకు మద్దతు కల్పించేందుకు ప్రధాని చొరవ చూపాలన్నదే వీరి డిమాండ్. ఈ విషయంలో గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంటూ నిజామాబాద్‌లో టీఆర్ఎస్ ఎంపీ కవితపై పోటీకి దిగిన రైతులు, ఆ తర్వాత మోదీపైనా పోటీ చేయనున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. 40 మంది రైతులు వారణాసి వెళ్లారు.

అడుగడుగునా ఆటంకాలే..
నిజామాబాద్ రైతులు వారణాసిలో అడుగుపెట్టినప్పటి నుంచి వారికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. స్థానిక బీజేపీ నాయకుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. అంతేకాదు, అధికారులు, పోలీసుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నట్టు రైతులు స్వయంగా పేర్కొన్నారు. అక్కడి పోలీసులు తమను వెంటాడుతున్నారంటూ వాపోయారు. ఇక, వీరిని అడ్డుకున్న బీజేపీ నాయకులు, రైతులకు అండగా నిలిచిన స్థానిక రైతులను కూడా అడ్డుకున్నారు. రైతులను ప్రతిపాదించవద్దంటూ బెదిరించారు.

చివరికి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా..
వారణాసిలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వెనక్కి తగ్గని రైతులపై మరో రకంగా దాడి మొదలైంది. రైతులు బస చేసిన సిల్క్‌సిటీ లాడ్జిపై ఇంటెలిజెన్స్ అధికారులు దాడులకు దిగారు. గదులు ఎవరి పేరిట బుక్ అయ్యాయో వారి వివరాలు కావాలంటూ లాడ్జి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసులు వారిని లాడ్జి నుంచి ఖాళీ చేయించారు. చివరికి రైతులు సమకూర్చుకున్న బస్సును కూడా ఎక్కకుండా ఇబ్బందులు పెట్టారు. బస్సెక్కితే పోలీసులు పట్టుకుంటారని హెచ్చరించడంతో చేసేది లేక రైతులు గ్రూపులుగా విడిపోయారు. ఆటోల్లో సిటీ దాటారు.

మీడియా, న్యాయవాదులు అండగా..
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిన స్థానిక మీడియా, న్యాయవాదులు రైతులకు అండగా నిలిచారు. వారి సాయంతో రైతులు తిరిగి ఖాళీ చేసిన లాడ్జిలోనే దిగారు. లాయర్లు అండగా నిలబడడంతో 25 మంది రైతులు మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. ప్రతిపాదించేవారు దొరకకపోవడంతో మిగతా రైతులు పోటీకి దూరమయ్యారు. అయితే, రెండు రోజులపాటు జరిగిన దరఖాస్తుల పరిశీలనలో ఎన్నికల అధికారులు 24 మంది రైతుల నామినేషన్లను తిరస్కరించారు. ఒక్క సున్నం ఇస్తారి నామినేషన్ మాత్రమే ఆమోదం పొందినట్టు అధికారులు తెలిపారు. నామినేషన్ల తిరస్కరణపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణం లేకుండా తమ నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. అధికారుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*