పల్లెలను వణికిస్తున్న శ్రీనివాస్ రెడ్డి

భువనగిరి: శ్రీనివాసరెడ్డి.. ఇప్పుడీ పేరు వింటే చాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలారామారంలోని పల్లెలు వణికిపోతున్నాయి. ఇన్నాళ్లు తమ మధ్యే ఉంటూ అనుమానం రాకుండా అత్యాచారం, హత్యలు చేస్తున్న విషయం తెలుసుకున్న పల్లె ప్రజల గుండెలు గుభేల్ మంటున్నాయి. మండలంలోని మైసిరెడ్డిపల్లి, మల్యాల, ధర్మారెడ్డిగూడెం ప్రజలు చర్చంతా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అలియాస్ హనుమంతుపైనే. తమ మధ్యే తిరుగాడిన ఓ సైకో కిల్లర్ గురించి కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.

నిజానికి బొమ్మలరామారం రాజధాని హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్నప్పటికీ పూర్తిగా పల్లెవాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలందరూ వలస కూలీలు కావడంతో పగటిపూట నిర్మానుష్యంగా ఉంటాయి. తల్లిదండ్రులు పనులకెళ్తే, పిల్లలు బడులకు వెళ్లిపోతారు. దీంతో సాయంత్రమైతే కానీ జనసంచారం పెద్దగా కనిపించదు. ఇలాంటి పల్లెల్లో శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా కల్లోలం నింపాడు. ఈ గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం, బస్సులు, ఆటోలు సైతం ఊర్లోకి రాకపోవడాన్ని సైకో శ్రీనివాస్‌రెడ్డి తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. లిఫ్ట్ పేరతో అమ్మాయిలను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్యచేసి బావిలో పడేసి పూడ్చిపెట్టడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు.

ఎంతటి కిరాతుకుడికైనా ఏదో ఓ రోజు పాపం పండక తప్పదన్నది శ్రీనివాసరెడ్డి ఉదంతంతో మరోమారు నిజమైంది. గత నెల 25న శ్రావణిని కూడా లిఫ్ట్ పేరుతో బైక్‌పై ఎక్కించుకున్న ఈ కామాంధుడు అత్యాచారం చేసి ఆపై హత్యచేసి బావిలో పాతిపెట్టాడు. ఆ తర్వాత తనకేం తెలియదన్నట్టు ఊర్లోకి వెళ్లాడు. అనంతరం తన స్నేహితుడి పెళ్లికి కూడా హాజరై తనపై ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే, అదే రోజు సాయంత్రం శ్రావణి మృతదేహం లభించడంతో శ్రీనివాస్ రెడ్డి బాగోతం బయటపడింది.

శ్రీనివాస్‌రెడ్డిని విచారించిన పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తున్నారంటే అతడు చేసిన నేరాలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. నాలుగేళ్ల క్రితం కల్పనను, నెల క్రితమే మరో అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసినట్టు చెప్పడంతో పోలీసులకే చెమటలు పట్టాయి. గతంలో తాము ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు సీరియస్‌గా తీసుకుని ఉండి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, శ్రీనివాస్‌రెడ్డిని విచారిస్తున్న పోలీసులు మరోవైపు హాజీపూర్ పక్కనే ఉన్న మైసిరెడ్డిపల్లి, మల్యాల, ధర్మారెడ్డిగూడెం, బొమ్మలరామారం మండల కేంద్రంతోపాటు బీబీనగర్‌, కీసర, ఘట్‌కేసర్‌లలో పలువురిని విచారించినట్లు తెలిసింది. మిస్సింగ్‌ కేసులతోపాటు తప్పిపోయినా ఫిర్యాదు చేయనివారు ఇంకా ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు.

నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని భవనగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు రిమాండ్‌ నిమిత్తం వరంగల్‌ జైలుకు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో శ్రీనివాస్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని మరిన్ని కోణాల్లో విచారించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*