అందుకే రోహిత్‌ను చంపేశా

న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీని ఎందుకు చంపిందీ అతడి భార్య అపూర్వ శుక్లా బయటపెట్టింది. రోహిత్‌కు తన మరదలితో అక్రమ సంబంధం ఉందని, వారిద్దరికీ పుట్టిన బిడ్డకు ఆస్తి మొత్తాన్ని రాసిచ్చే ప్రయత్నం జరుగుతుండడంతోనే ఆయనను హతమార్చినట్టు తెలిపింది. అక్రమ సంబంధం విషయంలో తమ మధ్య చాలాసార్లు గొడవ జరిగిందని పేర్కొంది. నిజానికి రోహిత్ అంత మంచోడేమీ కాదని, తనను చాలా హింసించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. రోహిత్ తివారీ హత్య కేసులో అపూర్వను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు రోజులుగా ఆమెను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా భర్తను తానెందుకు హత్య చేయాల్సి వచ్చిందీ పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించింది.

అపూర్వది మధ్యప్రదేశ్. లా చదువుకున్న ఆమెకు రాజకీయాలంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా వాటిలో రాణించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో రోహిత్ తివారీ వివరాలు చూసిన ఆమె అతడిని పెళ్లాడాలని నిర్ణయించుకుంది. రాజకీయంగా బోల్డంత పలుకుబడి ఉన్న రోహిత్‌ను చేసుకుంటే తన కల నెరవేరుతుందని భావించింది. దీంతో మరోమాటకు తావులేకుండా రోహిత్‌ను పెళ్లాడింది.

అయితే, పెళ్లి తర్వాత తన ఆశలు కుప్పకూలుతున్నట్టు అపూర్వ భావించింది. మరదలితో వివాహేతర సంబంధం కారణంగా బిడ్డ కూడా పుట్టాడని తెలియడంతో నివ్వెరపోయింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వివాదం కూడా జరిగింది. అతడితో కలిసి ఉండి లాభం లేదని భావించిన అపూర్వ విడిపోవాలని నిర్ణయించుకుంది. విడాకుల నోటీసు కూడా పంపింది. అయితే, అదే సమయంలో రోహిత్‌కు హార్ట్ సర్జరీ జరగడంతో మనసు మార్చుకుంది. భర్తతో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది.

తాను మారినప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడం, అతడికి తల్లి కూడా తోడవడంతో విసిగిపోయింది. తన స్వేచ్ఛను వారు హరిస్తున్నారని భావించింది. బెడ్‌రూములోని కర్టెన్లు మార్చాలన్నా అత్త అనుమతి ఉండాల్సిందేనంటూ విచారణలో పోలీసులకు చెబుతూ బావురుమంది. మరదలికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వాలంటూ ఆమె గద్దించే సరికి రోహిత్ అంగీకరించాడని పేర్కొంది. అదే జరిగితే తన పరిస్థితి అన్యాయం అయిపోతుందని భావించానని, దీంతో తీవ్ర మానసిక ఒత్తిడి గురయ్యానని తెలిపింది. పరిపరి విధాల ఆలోచించిన తర్వాత ఇక రోహిత్‌ను చంపడమే మేలని భావించి అంతమొందించానని అపూర్వ పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*