సీఎం చెంప పగలగొట్టినందుకు బాధగా ఉందట!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెంప పగలగొట్టినందుకు సురేశ్ ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నాడు. అలా కొట్టి ఉండాల్సింది కాదని, ఎందుకు కొట్టానో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ పశ్చాత్తపడుతున్నాడు. సీఎం చెంప చెళ్లుమనిపించమని తనకు ఎవరూ చెప్పలేదని, తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని చెప్పుకొచ్చాడు. పోలీసులు తనను బాగానే చూసుకున్నారని, తనను ఏమీ అనలేదని పేర్కొన్నాడు. తాను చేసిన తప్పేంటో చెప్పారు తప్పితే తనను ఏమీ అనలేదని, గౌరవంగానే చూసుకున్నారని సురేశ్ వివరించాడు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 4న పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రచారం చేస్తున్న ఓపెన్ టాప్ జీపుపైకి ఎక్కిన సురేశ్ అనే మెకానిక్ కేజ్రీవాల్ చెంప చెళ్లుమనిపించాడు. షాక్‌కు గురైన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వెంటనే అతడిని పట్టుకుని చావబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేజ్రీవాల్‌కు చెంపదెబ్బలు ఇదేమీ మొదటిసారి కాదు. 2015లో తొలిసారి ఆయనపై దాడి జరిగింది. ఆ తర్వాత అదే ఏడాది ఓ ఆటోరిక్షా డ్రైవర్ కేజ్రీవాల్ చెంప వాయించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*