రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంపుల్లో నాటకాలతో సందేశాలు

హైదరాబాద్: రామకృష్ణ మఠం జరుగుతోన్న సమ్మర్ క్యాంపుల్లో విద్యార్ధులకు నాటకాలతో సందేశాలిస్తున్నారు. గత 40 రోజులుగా మఠంలో నాలుగో తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ విద్యార్ధులకు వేర్వేరుగా వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నారు. శ్రద్ధ, సంస్కార్ పేరుతో చేపడ్తోన్న శిబిరాల్లో భాగంగా యోగా, ధ్యానం, భజనలు, నైతిక విలువలకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్ధుల కోసం నేచర్ వాక్ నిర్వహిస్తున్నారు. తద్వారా వివిధ మొక్కలు, చెట్ల గురించి తెలియజేయడంతో పాటు ప్రకృతి మాత గురించి విద్యార్ధులకు వివరిస్తున్నారు. విద్యార్ధులకు విలువిద్యపై ప్రాధమిక శిక్షణ ఇస్తున్నారు. మఠంలో నిత్యం నిర్వహించే నారాయణ సేవను విద్యార్ధులు సందర్శిస్తున్నారు. నారాయణ సేవలో భాగంగా విద్యార్ధులు పేదలకు అన్నదానం చేస్తున్నారు. స్వయంగా ఆహార పదార్ధాలు వడ్డిస్తున్నారు. అంతేకాదు విద్యార్ధులు స్వయంగా నిమ్మరసం తయారు చేసి విక్రయిస్తూ వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

ఇవన్నీ ఒకెత్తయితే సమ్మర్ క్యాంపుల్లో విద్యార్ధులకు నాటకాల ద్వారా సందేశాలిస్తున్నారు. శ్రద్ధ క్యాంపులో చేసిన జయం మనదేరా నాటకానికి మంచి స్పందన వచ్చింది. ఇంటర్ ఫలితాల నేపథ్యంలో ఆత్మహత్యలు తగదంటూ ఈ హాస్యనాటికను ప్రదర్శించారు. ఈ నాటిక అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్ధులకు కనువిప్పు కలిగించింది. ప్రస్తుతం నిర్వహిస్తోన్న సంస్కార్ వేసవి శిబిరంలో మరో మూడు నాటకాల కోసం విద్యార్ధులు సన్నద్ధమౌతున్నారు. సీనియర్ జర్నలిస్ట్, రచయిత ఆదూరి వేంకటేశ్వరరావు రచించిన గోవిందుడు అందరివాడేలే, యువ జర్నలిస్ట్ చతుర్వేది జైసింహ రచించిన మలుపు, జర్నలిస్ట్ ఏవీ నారాయణ రావు రచించిన కనకదాసు నాటకాల కోసం మఠంలో విద్యార్ధుల ప్రాక్టీస్ కొనసాగుతోంది. ఈ నెల 22న సమ్మర్ క్యాంపుల ముగింపు సభలో వీటిని ప్రదర్శిస్తారు. ఇవే కాక అదే రోజు అనేక నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నృత్య రూపకాలకు వాలంటీర్లు గాయత్రి, దీప్‌శిఖ నేతృత్వంలో అభ్యాసాలు కొనసాగుతున్నాయి. యోగాపై ప్రత్యేక ప్రదర్శన కోసం యోగా మాస్టర్ లివాంకర్, యోగా గురువు దీప్తి విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*