మహర్షి రివ్యూ

మహేశ్ బాబు మారాలి.

ఇటీవల ఎన్నో అంచనాలతో విడుదలైన మహేశ్ బాబు 25 వ సినిమా మహర్షి చూసిన తర్వాత దాదాపు ప్రతీ సగటు సినీ ప్రేమికుడికీ కలిగిన సందేహం మహేశ్ బాబు ఇక మారడా ? అని.

తన రెండు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో మాస్, క్లాస్ సినిమాలతో పాటు టక్కరి దొంగ , మురారి , నాని , నిజం, ఖలేజా మరియు వన్ వంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో చేసిన మహేశ్ బాబు గత కొద్ది కాలంగా చేస్తున్న చిత్రాలు గమనిస్తే తను ఒక రకమైన మూస ధోరణిలో వెళ్తున్నాడెమోనన్న భావన కలగడం సహజం.

ప్రత్యేకించి , 2015 నుంచి తాను చేసిన సినిమాలు ఒకసారి గమనిస్తే స్పైడర్ సహా అన్నీ సినిమాలలోనూ తన నటన ఒకే రకంగా ఉండడం గమనించవచ్చు. అంతేకాకుండా శ్రీమంతుడు , బ్రహ్మోత్సవం , భరత్ అనే నేను మరియు మహర్షి చిత్రాల్లో తన పాత్రలు కూడా ఒకే రకంగా ఉండడం చూడవచ్చు. ఆ చిత్రాల్లో మహేశ్ చేత ( కొన్ని చోట్ల అసందర్భంగా) చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇప్పించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. అసలు మహేశ్ బాబు సినిమా అంటేనే స్పీచ్ లు ఇవ్వడం అనుకునే స్థితికి జనాలు వచ్చేరంటే వాస్తవ పరిస్తితి అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ ఇటువంటి భారీ డైలాగులు చెప్తే కొన్ని సార్లు ఆదరించిన వాళ్ళే ఇంకొన్ని సార్లు తిరస్కరించారు.అయినప్పటికీ అవి యాక్షన్ / సీరియస్ సంభాషణలు కాబట్టి కనీసం అభిమానులు మురిసిపోయేవారు. కానీ ఇలా కుటుంబ కధా చిత్రాల్లో ఈ రకమైన ధోరణి అన్నీ సార్లూ వర్కవుట్ కాక పోవచ్చు.

 

ఇక మహేశ్ నటన విషయానికొస్తే రాను రాను తను ఒక సింగల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ మాదిరి తయారవుతున్నాడా అనిపిస్తోంది చూస్తూంటే. పైన పేర్కొన్న అన్నీ సినిమా ల్లో తన డిక్షన్, డైలాగ్ డెలివరీ మరియు ముఖ కవళికలు చాలా వరకూ ఒకేలా ఉంటున్నాయి. ఇక్కడ ఒక విషయం గమనిస్తే తెలుగు ఇండస్ట్రిలో తన సమకాలీన నటులైన జూ.ఎన్టీఆర్ , అల్లు అర్జున్ & రామ్ చరణ్ లతో పోలిస్తే మహేశ్ ముఖంలో ఒక రకమైన సహజ సౌందర్యం కనిపిస్తుంది . దాన్ని కొంచెం బాగా ఉపయోగించుకుంటే మరెన్నో విభిన్న తరహా భావాలు చాలా అందంగా పలికించవచ్చు. ఇంకొక గమనించ దగ్గ విషయమేమంటే పైన పేర్కొన్న నటుల మాదిరిగా , మహేశ్ సినిమా ల్లో అబ్బురపరచే రీతిలో అద్భుతమైన డాన్స్ విన్యాసాలు ఉండవు. అందుకే తన బలాలను గ్రహిస్తూ , తన పరిమితులను దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పటినుండైనా మంచి పాత్రలు ఎన్నుకుంటాడని ఆశిస్తున్నాం.

ఇకపోతే , తన ప్రస్తుత సినిమా మహర్షి విషయానికొస్తే ఆ సినిమా ద్వారా చెప్పదల్చుకున్న సందేశం గొప్పదే అయినప్పటీకీ ఆ ప్రయత్నంలో కొంత నిజాయితీ లోపించిందని చెప్పచ్చు . కాలేజీ రోజుల్లో యూత్ ఫుల్ గా ఉండే ఫ్యాన్సి డ్రస్లు వేసుకున్నా సరిపోతుంది గానీ పొలాల్లో వ్యవసాయం చేసేటప్పుడు కూడా అవే బ్రాండెడ్ బట్టలు వేస్తామంటే కుదరదు. ఇస్త్రీ మడత నలగకుండా ఫైట్లు చేసినా చూసేవారుంటారేమో గానీ , చెమట పట్టకుండా , చొక్కా నలక్కుండా పొలం దున్నేస్తామంటే మాత్రం చూడడానికి అంత అతికినట్టుగా ఉండదు. ఈ విషయంలో రంగస్థలంలో రామ్ చరణ్ నటన మెచ్చుకోదగ్గది. ఆ సినిమాలో అమాయకత్వంతో కూడిన ఒక చెవిటి వాడి పాత్ర తత్వాన్ని అర్ధం చేస్కుని దానికి తగ్గట్లు తనను తను మలచుకున్న విధానం ముచ్చట గొలుపుతుంది. అలాగీ, జై లవకుశ లో నత్తివాడిగా ఎన్టీఆర్ నటన కూడా ప్రశంస నీయమే.

 

చివరగా , ఒక్కసారి ఈ ఏడాది వేసవిలో వచ్చిన చిత్రాలు గమనిస్తే కూడా కథల ఎంపిక పరంగా టాలీవుడ్ లో వచ్చిన విశేష మార్పులు గమనించవచ్చు.ఏప్రిల్ లో వచ్చిన మజిలీ, చిత్ర లహరి మరియు జర్సీ దేనికదే భిన్నమైన ఉద్వేగపూరిత కథాంశంతో చక్కటి కథ బలంతో మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. ఆ సినిమా ల హీరోలు కూడా మహేశ్ కంటే వయసులో , అనుభవంలో చిన్నవారే . ఇకనుంచైనా మహేశ్ ఆ మూస ధోరణులను విడిచి తన నటన లోని మరో కోణాన్ని చూపించి , ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకుంటూ తన అభిమానులను , ప్రేక్షక లోకాన్ని అలరిస్తాడని కోరుకుందాం.

 

– లహరి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*