పవన్‌కు పార్టీపై శ్రద్ధ లేదా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్

విజయవాడ: ఏపీ పీఠం ఎవరిదో తేలేందుకు ఉన్న సమయం మరికొన్ని గంటలే. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రమే కాదు.. తెలుగు ప్రజలు మొత్తం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను పక్కనపెడితే ఎవరి లెక్కలు వారికున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ జగన్‌దే అధికారమంటూ ముక్తకంఠంతో చెబుతుంటే- చంద్రబాబు మాత్రం వందకు వెయ్యిశాతం గెలుపు తమదేనని ధీమాగా ఉన్నారు.

ఈ లెక్కలను పక్కనపెడితే, ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కామన్‌గా చెప్పిన విషయం ఒకటుంది. అది జనసేన గురించి. ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలనుకున్న జనసేనకు ఐదు సీట్లకు మించి రావని తేల్చేశాయి. ఆ సంగతి పక్కనపెడితే పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపు కష్టమని, ఒక్కదాంట్లోనే విజయం సాధిస్తాడని కూడా చెప్పేశాయి. మరోవైపు, లోక్‌సభ బరిలో దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పవన్ సోదరుడు నాగబాబుకు లక్ష్యం ఇప్పుడప్పుడే నెరవేరే అవకాశం కూడా లేదని స్పష్టం చేశాయి.

ఇక, ఏపీలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కౌంటింగ్ డే కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవగా జనసేన ఆ విషయాన్నే మరిచిపోయింది. వైసీపీ, టీడీపీలలో అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు. కౌంటింగ్ రోజు కోసం ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. తెలుగుదేశం కూడా ముందస్తుగానే సిద్ధమై కౌంటింగ్ రోజు కోసం కౌంటింగ్ ఏజెంట్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చింది. ఇక మిగిలింది జనసేన.

ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం చూపలేకపోయిందన్న నైరాశ్యమో, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన షాకో తెలియదు కానీ- కౌంటింగ్ డే గురించి జనసేన పూర్తిగా మర్చిపోయింది. ఆ పార్టీ నేతల్లో చాలామంది రాజకీయాలకు కొత్తకావడంతో కౌంటింగ్ ఏజెంట్లన నియమించడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిజం చెప్పాలంటే, కౌంటింగ్ ఏజెంట్లను కూడా నియమించుకోలేని దుస్థితిలో ఉండడం ఏ పార్టీకైనా ప్రమాదమే. గెలిచే అవకాశం ఉందని భావిస్తున్న చోట్ల కూడా ఆ పార్టీకి ఏజెంట్లు లేకపోవడం చూస్తుంటే జనసేన ఎంత నైరాశ్యంలో కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇవి చిన్నచిన్న పొరపాట్లుగా కనిపించినప్పటికీ రాజకీయాలపై ఆ పార్టీకి పూర్తి స్థాయిలో శ్రద్ధ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. మార్పు కోసమే జనసేన అన్న పవన్‌ అడుగులు ఫలితాల తర్వాత ఎటువైపు పడతాయన్నది వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*