30 ఏళ్ల చరిత్రను లోకేశ్ తిరగ రాయబోతున్నారా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల విడుదల వేళ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నారా లోకేశ్ ఒకరు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కావడం ఇందుకు ఒక కారణమైతే, తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడటమే రెండో కారణం. మంగళగిరి నుంచి బరిలో దిగిన లోకేశ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో తలపడుతున్నారు. లోకేశ్‌కు రామకృష్ణారెడ్డి గట్టి పోటీ ఇచ్చారని, మంగళగిరిలో లోకేశ్ ఓడిపోవడం ఖాయమని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్‌ మాత్రం లోకేశ్ విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నాయి. లోకేశ్ గెలుపోటముల విషయంలో కోట్లలో బెట్టింగులు కూడా జరిగినట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై గెలుపొందారు. ఆయనకు 88,977 ఓట్లు రాగా.. చిరంజీవికి 88965 ఓట్లొచ్చాయి. చేనేత వర్గం, ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో విజయం కోసం నారా లోకేశ్ గట్టిగానే ప్రచారం చేశారు. చివర్లో ఆయన సతీమణి బ్రహ్మణి కూడా ప్రచారం నిర్వహించారు. 1985 తరువాత మంగళగిరిలో ఎగరని టీడీపీ జెండా లోకేశ్ గెలుపుతో సగర్వంగా ఎగురుతుందని, లోకేశ్ గెలిచి 30 ఏళ్ల చరిత్రను రాయనున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

తరచి చూస్తే.. స్థానికేతరుడన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ తప్ప లోకేశ్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ లోపాలు ఏమీ లేవని, కాబట్టి ఆయన విజయం నల్లేరు మీద నడకేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రిగా రాజధాని ప్రాంతమైన మంగళగిరి అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయడం, పార్టీ గెలిస్తే మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్లుగా చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*