ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్!

న్యూఢిల్లీ: ఏంటో? ఈ మధ్య ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు.. ఇలాంటి మాటలు ఎప్పుడో ఒక్కప్పుడు మన నోటి నుంచి వస్తాయి. అయితే, ఇది మనుషులకే కాదు, సోషల్ మీడియాకు ఇది వర్తిస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్ ఖాతాలు దుర్వినియోగమైన విషయం వచ్చి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేగాయి. మొదట్లో లేదంటూ ఫేస్‌బుక్ బుకాయించినా ఆ తర్వాత నిజమేనంటూ ఒప్పుకుంది.

ఫేస్‌బుక్ ప్రకటనతో దాని ఖాతాదారులు కంగారు పడ్డారు. తెలియని వారి చేతుల్లోకి తమ వ్యక్తిగత వివరాలు వెళ్లిపోతున్నాయంటూ తలల పట్టుకున్నారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితే ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులకు ఎదురైంది. నిజానికి సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలందరికీ ఇందులో ఖాతాలు ఉన్నాయి. ఒక్కొక్కరికీ లక్షలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇప్పుడు వీరందరికీ షాకిచ్చే వార్త ఒకటి బయటకొచ్చి సంచలనమైంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సర్వర్‌లో ఉన్న యూజర్ల డేటాకు ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదని, ఎవరైనా ఆ డేటాను ఇట్టే యాక్సెస్ చేయొచ్చని సెక్యూరిటీ రీసెర్చర్ అనురాగ్ సేన్ బయటపెట్టి కలకలం రేపారు. దాదాపు 5 కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు, సెలబ్రిటీలు, అఫీషియల్ బ్రాండ్ అకౌంట్స్ నుంచి డేటా లీక్ అయిందని అనురాగ్ పేర్కొన్నారు. అంతేకాదు, అలా లీకైన డేటా మొత్తం ముంబైకి చెందిన సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ చాటర్‌బాక్స్ (Chtrbox) చేతుల్లోకి వెళ్లిందని తేలింది.

అనురాగ్ సేన్ ప్రకటనపై చాటర్‌బాక్స్ సీఈవో ప్రణయ్ స్పందించకపోయినా, ఫేస్‌బుక్ స్పందించింది. ఐదు కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటా లీకేజీ వ్యవహారంపై దృష్టి సారించినట్టు పేర్కొంది. డేటా ఎలా లీకైందన్న దానిపై విచారణ జరుపుతున్నట్టు తెలిపింది. విచిత్రం ఏమిటంటే-ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ కావడం ఇదే తొలిసారి మాత్రం కాదు. రెండేళ్ల క్రితం ఓ బగ్ కారణంగా 60 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఐదు కోట్ల మంది ఖాతాదారుల లీక్ డేటా కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*