మరోసారి బీజేపీ సునామీ… 2014కు మించి ఎంపీ సీట్లు కైవసం

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించినట్లే బీజేపీ మరోసారి సత్తా చాటింది. 542 స్థానాలకు గానూ సొంతంగా 303 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఎన్డీయే మిత్రుల సహకారం అవసరం లేకుండానే అధికారం చేపట్టడానికి కావాల్సిన సంఖ్యబలాన్ని బీజేపీ సంపాదించుకుంది. హిందీ రాష్ట్రాల్లో బీజేపీ విజృంభించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లో సంచలన విజయాలు నమోదు చేసుకుంది.

యూపీలో ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తు ఉన్నా బీజేపీ ఘనమైన విజయం సాధించింది. 60కిపైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.

మిత్రపక్షాలతో కలిసి పోటీచేసిన మహారాష్ట్ర, బీహార్‌లో ఎన్డీయే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 350 స్థానాలను గెలుచుకుంది.

దీదీ కంచుకోట పశ్చిమబెంగాల్‌నూ మోదీ సేన బద్దలు కొట్టింది. 16 స్థానాల్లో బీజేపీ విజయం  సాధించింది. ఒడిశాలోనూ బీజేపి 9 స్థానాలు గెలుచుకుంది.

ఇటు దక్షిణాదిలోనూ కమలం పార్టీ దూసుకెళ్లింది. కర్ణాటకలో 23 చోట్ల విజయకేతం ఎగురవేసింది.

తెలంగాణాలో 4 చోట్ల బీజేపీ గెలిచింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ గెలిచారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు గెలిచారు. నిజామాబాద్‌లో డీఎస్ తనయుడు అర్వింద్ కేసీఆర్ కుమార్తె కవితను ఓడించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ దూసుకెళ్లింది

ఈ సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల వద్ద పండగ వాతావరణం నెలకొంది.

పాజిటివ్ ఓటుతో కేంద్రంలో తిరిగి అధికారం నిలబెట్టుకున్నామని కమలనాథులంటున్నారు.

మరోసారి అధికారం చేపట్టనున్న నేపథ్యంలో ప్రధాని మోదీని వివిధ దేశాధినేతలు అభినందిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*