నవ్వులు పూయించిన జై సింహ మలుపు నాటకం

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో 45 రోజులుగా కొనసాగిన సమ్మర్ క్యాంప్‌లు ముగిశాయి. రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో సమ్మర్ క్యాంప్‌ ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

రామకృష్ణ మఠం విశిష్టతను తెలియజేస్తూ జర్నలిస్ట్ జై సింహ రచించిన మలుపు నాటకం నవ్వులు పూయించింది. నాటకంలో భాగంగా విద్యార్ధులు వేసిన కౌంటర్లను, సరదా సంభాషణలను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు.

పదో తరగతి వేసవి సెలవుల్లో వివిధ ప్రదేశాలకు వెళ్లడానికి విద్యార్ధులు ఆసక్తి చూపిస్తుంటారు. హైదరాబాద్ ఎండలను భరించలేక ఓ విద్యార్ధి గోవాకి వెళ్తానంటే, మరొకరు స్విమ్మింగ్ పూల్‌కి వెళ్తానంటాడు. మిగతా విద్యార్ధుల్లో కొందరు క్రికెట్ క్యాంప్‌కి వెళ్తానంటారు. మరో విద్యార్ధి తన స్వగ్రామానికి వెళ్లి తన దగ్గరుండే ఉండేలుతో కల్లు కుండలు పగలకొడతానంటాడు. ఓ విద్యార్ధి సినిమాలు చూస్తానంటే, మరో విద్యార్ధి బ్రేక్ డ్యాన్స్ క్యాంప్‌కు వెళ్తానంటాడు. ఒక్క విద్యార్ధి మాత్రం రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంప్‌కు వెళ్తానంటాడు. మఠంలో నిర్వహించే సమ్మర్ క్యాంప్‌కు వెళ్తానన్న విద్యార్ధిని మిగతా ఫ్రెండ్స్ అంతా ఆటపట్టిస్తారు. ఆరేళ్ల తర్వాత అందరి జీవితాల్లో ఏం జరిగిందనేది మలుపు నాటకంలో చూపించారు. రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంప్‌కు హాజరైన విద్యార్ధి సివిల్స్ పాసై ఐఏఎస్ అయినట్లు చూపించారు. తనకు రామకృష్ణ మఠంలో మంచి శిక్షణ లభించిందని, మఠంలో నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది ఐఏఎస్ అయ్యానని ఆ విద్యార్ధి చెబుతాడు. గోల్ సెట్ చేసుకోవడం, లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుసరించాల్సిన ప్లాన్, టైమ్ మేనేజ్‌మెంట్, టీమ్ వర్క్ వగైరా మఠం నుంచే నేర్చుకున్నానని చెబుతాడు. మిగతా స్నేహితులకు ఈ తరహా శిక్షణ లేని కారణంగా వాళ్లంతా లైఫ్‌లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోతారు. జీవితంలో మంచి సక్సెస్ సాధించేందుకు రామకృష్ణా మఠం వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌లో నిర్వహించే కోర్సుల్లో చేరాలని ఐఏఎస్ అయిన విద్యార్ధి తన స్నేహితులకు సూచించడం, అంతా ఛలో ఆర్‌కే మఠ్ అనడంతో నాటకం ముగుస్తుంది. అయితే నాటకం మొత్తం సరదా సంభాషణలుండటంతో ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యాయి.

నాటకంలో ఐఏఎస్‌ అయిన విద్యార్ధిగా శ్రీవర్ నటించగా సొంతూరుకు వెళ్లే గ్రామీణ విద్యార్ధి పాత్రలో సంతోష్ నటించాడు. గోవాకు వెళ్లే విద్యార్ధి పాత్రలో అనిశ్ నటించగా కేరాఫ్ స్విమ్మింగ్ పూల్ పాత్రలో మయాంక్ నటించాడు. క్రికెట్ పిచ్చోళ్ల పాత్రలో యతీశ్వర్, సుశాంత్ నటించారు. సినిమా పిచ్చోడి పాత్రలో భాను నటించాడు. డ్యాన్స్ క్యాంప్‌కు వెళ్లే పాత్రలో చేతన్ నటించాడు.

మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*