ఆదూరి నాటకం గోవిందుడు అందరివాడేలేపై ప్రశంసల జల్లు

హైదరాబాద్: రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంప్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు నాటకాలు ప్రదర్శించారు. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఆదూరి వెంకటేశ్వరరావు రచించిన గోవిందుడు అందరివాడే నాటకం ఆహుతులను అలరించింది. కృష్ణ భక్తిని చాటి చెప్పేలా రూపొందించిన ఈ నాటకంలో సంకర్షణ కృష్ణుడిగా నటించారు. పురవ్ కృష్ణ భక్తుడిగా, సత్య తండ్రి పాత్రలో నటించారు. చిన్నారుల నటనకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు.

 

-ఆదూరి వెంకటేశ్వరరావు రచించిన గోవిందుడు అందరివాడేలే…! యధాతథంగా

——————————————————————————————

ఇంట్రడక్షన్: పిల్లలూ, దేవుడూ చల్లనివారే, కల్లకపట మెరుగని కరుణామయులే…అని తరచు చెబుతుండేవారు శ్రీ రామకృష్ణ పరమహంస. బాల ప్రహ్లాదుడు, ధ్రువుడి భక్తి అలాంటిదే. బాలగోపాలుడితో ఆడిపాడి, కష్టసుఖాలు పంచుకున్న బాలగోపాలుర మైత్రీ బంధమూ దీనికి ఏమాత్రం తక్కువ కాదు. ఆత్మార్పణ భావంతో, ఆర్తితో, పరిపూర్ణ శరణాగతితో భగవంతుడిని పిలిస్తే భగవానుడే స్వయంగా దిగొస్తాడు. మీరు పెట్టిన గోరుముద్దలూ తింతాడు, మీతో వైకుంఠపాళీలూ ఆడతాడు. ఇందుకు తార్కాణంగా రామకృష్ణుల వారు ఓ కథ చెప్పేవారు.

కథాక్రమం…
అదొక అగ్రహారం. అందులో ఓ సదాచార పరుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. నిత్యం బ్రాహ్మీ ముహూర్తానే లేచి కాలకృత్యాలు ముగించుకుని పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేవాడు. అనంతరం నైవేద్యాన్ని తన అర్చనామూర్తికి సమర్పించేవాడు. ఆయన కుమారుడైన చిన్నారి గోవిందుడికి కూడా భక్తి ఎక్కువే. తండ్రి పూజాకార్యక్రమాల్లో సహాయపడుతుండేవాడు.

ఓరోజు ఆ బ్రాహ్మణుడు బాల గోవిందుడ్ని పిలిచి ‘నాయనా పని మీద పక్క ఊరు వెళ్తున్నాను. నేను లేనప్పుడు భగవంతుడికి నైవేద్యం అర్పించడం మాత్రం మరువొద్దు సుమా’ అని చెప్పి ఊరు బయలుదేరాడు. గోవిందుడు ఆ మరుసటి రోజు ప్రభాత ముహూర్తంలోనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, పూజామందిరలోని భగవంతుడి విగ్రహాన్ని పూలతో అలంకరించాడు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామికి నైవేద్యం సమర్పించాడు.

‘స్వామీ…నా పని నేను చేశాను. నువ్వు వచ్చి ఆరగించి వెళ్లు’ అని పిలిచాడు. స్వామి నుంచి ఉలూకూ లేదు, పలుకూ లేదు. మళ్లీ గోవిందుడు పాతపాటే అందుకున్నాడు. ‘స్వామీ…ఏమిటీ ఆలస్యం. రోజూ నాన్న నైవేద్యం పెడితే ఆరగిస్తున్నావే. ఇవాళ ఎందుకీ జాప్యం. పరమాన్నం చల్లారిపోతోంది. వేగిరం వచ్చి అరగించవయ్యా’ అని ఆర్తిగా పిలిచాడు. విగ్రహంలో చలనం లేదు. ఆశ్చర్యపోవడం బాల గోవిందుడి వంతైంది. ‘ఏమిటీ…నా పిలుపు స్వామి చెవికి సోకలేదా? లేదా అలిగాడా?’ అని తనలో తాను అనుకుంటూ మరో ప్రయత్నం చేశాడు. ‘స్వామీ…ఏమిటీ జాప్యం. నువ్వు నైవేద్యం తినలేదని నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే అపప్రద నాకు రాదూ. ఇదేనా నీ భక్త పరాధీనత? ఇదేనా చిన్నారుల పట్ల నీకున్న ప్రేమ. మేమంతా నీ బిడ్డలమేనట కదా. మరి ఈ బిడ్డ మీద నీకు ఎందుకీ కినుక. నా తండ్రివి కాదూ…పోనీ కళ్లు మూసుకుంటానులే. ఇలా వచ్చి అలా తినేసి వెళ్లిపో’ అంటూ ఆవేదనతో కూడిన స్వరంతో భగవానుడిని పిలిచాడు. కంట తడి పెట్టుకున్నారు. స్వామి ఇంకా రాలేదంటూ నేలపై పొర్లాడటం మొదలుపెట్టాడు.

గోవిందుని పిలుపు, ఆర్తి భగవానుడిని కదిలించింది. విగ్రహం స్థానంలో ఆయనే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ‘గోవిందూ…నీ పిలుపు నాకు ముందే అందిందయ్యా. కాకపోతే ఈ సృష్టిలోని వారంతా నా బిడ్డలే కదా. అందరి మంచి చెడ్డలూ చూసి వచ్చేసరికి కాస్త ఆలస్యమైందయ్యా. కష్టపెట్టుకోకు. ఏదీ..! ఆ పాయసం ఇలా పట్రా’ అంటూ గోవిందుడ్ని పిలిచాడు. గోవిందుడు వదనం ఒక్కసారిగా వెలిగిపోయింది. స్వయంగా భగవానుడి చేతికి పాయసం పాత్ర అందించాడు. ‘నోరు కాలుతుందోమో జాగ్రత్త. మెల్లగా తాగు’ అంటూ గోవిందుడు చెబుతుండగానే, ఆయన గటగటా పాయసం తాగేసి ఆ పాత్ర గోవిందుడి చేతిలో పెట్టాడు. స్వామి వారి మూతికి అంటుకున్న పాయసం పలుకులను గోవిందుడు తుడిచాడు. స్వామి తన బొజ్జ నిమురుకుంటూ….’తృప్తిగా ఉందయ్యా గోవిందూ. నువ్వెంత మంచివాడవో. ఇక నుంచి నీ మంచిచెడ్డలన్నీ నావేలే. మరి వెళ్లిరానా’ అంటూ గోవిందుడి దగ్గర సెలవు తీసుకుని అదృశ్యమయ్యాడు.

గోవిందు పూజామందిరం గది తలుపులు మూసి బయటకు వచ్చేసరికి పొరిగింటి వాళ్లు ప్రసాదం కోసం అక్కడకు వచ్చారు. ‘గోవిందూ ప్రసాదం పట్టుకురావయ్యా’ అని అడిగారు. ‘ఇంకెక్కడి ప్రసాదం. స్వామి ఒక్క పలుకు కూడా ఉంచకుండా ఆరగించేస్తే’ అంటూ అమాయకంగా గోవిందు సమాధానమిచ్చాడు. దీంతో బిత్తరపోవడం వచ్చిన వారి వంతైంది. ‘ఏమిటి…ప్రసాదం స్వామి తిన్నాడా. నమ్మశక్యంగా లేదే’ అంటూ ముక్కున వేలేసుకున్నారు. ‘నామాట మీద నమ్మకం లేకపోతే రండి. పూజాగదిలోకి వెళ్దాం’ అంటూ వారిని లోపలకు తీసుకెళ్లాడు గోవిందు. అక్కడ ప్రసాదం ప్లేటు ఖాళీగా కనిపించడంతో వారంతా అవాక్కయ్యారు. ఇంతలో గోవిందు తండ్రి రానే వచ్చాడు.

కాళ్లు కడుక్కునేందుకు తండ్రికి నీళ్లిచ్చిన గోవిందును…’అబ్బాయీ..! స్వామికి నైవేద్యం సమర్పించావా?’ అంటూ ఆయన ఆత్రంగా అడిగాడాయన. ‘ఓ.. భేషుగ్గా. స్వామి ఒక్క మెతుకు కూడా వదలకుండా లొట్టలేసుకుంటూ తిన్నారు. తృప్తిగా ఉందయ్యా అంటూ దీవించారు కూడా’ అని చెప్పాడు సంతోషంగా గోవిందు. ఇప్పుడు బిత్తరపోవడం ఆ పెద్దాయన వంతైంది. ‘ఏమిటీ? నువ్వు చెప్పేది..స్వామి దిగొచ్చి తిన్నారా?’ అని ఒకింత తీవ్రస్వరంతో అన్నాడు. గోవిందు ముఖం చిన్నబోయింది. ‘తండ్రిగారూ…అలా అడుగుతున్నారేం? రోజూ మీరు పెడితే స్వామి అలాగే తింటున్నారుగా? ఈరోజు కొత్తగా అడుగుతున్నారేం?’ అంటూ అమాయకంగా ప్రశ్నించాడు. గోవిందు తండ్రికి వచ్చిన కోపం నషాళానికి అటింది. ప్రసాదం తినేసి అబద్ధాలు కూడా ఆడతావా? అంటూ కర్ర పైకెత్తాడు. ఆశ్చర్యం…ఆయన చేయి గాలిలోనే ఉండిపోయింది. తండ్రి విలవిల్లాడుతుండటం చూసిన గోవిందు కంటితడిపెట్టారు.

వెంటనే కన్నయ్య వైపు తిరిగి…. ‘వాసుదేవా…నీవే దిక్కు.. నీవు నేను నివేదించిన ప్రసాదం తిన్నదే నిజమైతే నీ దయ మాపై కురిపించు’ అని ప్రార్థించాడు. క్షణంలో గోవిందు తండ్రి చేయి కదలింది. కృష్ణ భగవానుడు అశరీవాణి రూపంలో ఇలా సందేశమిచ్చారు. ‘గోవిందూ….నీ ఆర్తికి కరిగిపోయి నీ చేతి ప్రసాదం తిన్నానయ్యా. మీ తండ్రిగారు కూడా నా భక్తులే. కాకపోతే ఆయన భక్తి పరిపక్వం కాలేదంతే. ఆ రోజు కూడా త్వరలోనే ఉందిలే…’ అంటూ తండ్రీకొడుకులను దీవించారు. గోవిందుడి కళ్లు ఆనందంతో మెరిస్తే… గోవిందు తండ్రి కళ్లు చెమ్మగిల్లాయి. ‘నాయనా…గోవిందూ…నేటికి నీ వల్ల నా జన్మకూడా పావనమైందయ్యా!’ అంటూ కొడుకుని ఆప్యాయంగా ఆయన ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆనదంగా భగవాన్నామ సంకీర్తనలో మునిగిపోయారు.

రామకృష్ణుల ఉవాచ:

భగవంతుడి మనల్ని కోరేది నిష్కల్మషమైన భక్తినే. మరి చిన్నప్పటి నుంచి మన చిన్నారులు అలాంటి భగవద్భక్తి ఏర్పరచుకుని సాత్విక గుణాలు అలవరచుకుంటే, నీతివంతమైన జీవితంతో వారెంతో ప్రగతిని సాధిస్తారు. సమాజానికి ఆదర్శప్రాయులవుతారు. అలాంటి వారిని భగవంతుడు చివరి వరకూ వెన్నంటే ఉంటారు.

……………………………………..

కార్యక్రమాల్లో భాగంగా వాలంటీర్ శేషు రచించిన అరైజ్.. అవేక్ నాటిక ఆహుతులను కట్టిపడేసింది. అంతకు ముందు చిన్నారులు ఆలపించిన పాటలు అలరించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*