
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే తనను రాజ్యసభకు పంపాలని సుబ్బారెడ్డి కోరినట్లు సమాచారం. సుబ్బారెడ్డి ప్రతిపాదనను సీఎం తోసిపుచ్చి తర్వాత చూద్దామని చెప్పినట్లు సమాచారం.
నిజానికి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు మారుతారనే వార్తలు జోరందుకున్నాయి. టీటీడీ చైర్మన్గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ స్థానంలో మోహన్ బాబును ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగాలని భావించారు. కానీ టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వడం కోసం సుబ్బారెడ్డిని పక్కనబెట్టారు. దీంతో ఆయన కొంచెం అసంతృప్తితో కనిపించారు. తాజాగా, సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవిని జగన్ ఆఫర్ చేసినప్పటికీ ఆయన సుముఖంగా లేనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ మాత్రం తీసుకోవాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Be the first to comment