తెలంగాణలో కాంగ్రెస్ ఖల్లాస్.. కేసీఆర్‌పై టీ కాంగ్ కన్నెర్ర

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తైంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం విలీనం చేస్తున్నట్లు తెలంగాణ శాసనసభ కార్యదర్శి ప్రకటన జారీ చేశారు. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. దీంతో కాంగ్రెస్ బలం 6కు పడిపోయింది. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి చేరినవారితో టీఆర్ఎస్ బలం 103కి చేరింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని, దీంతో తమ బలం 105కు చేరుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో 7 స్థానాలున్న ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా మారింది. తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

అటు టీఆర్ఎస్‌తో అమీతుమీ తేల్చుకుంటామని టీ కాంగ్రెస్ పెద్దలు హెచ్చరిస్తున్నారు. న్యాయపోరాటం చేస్తామంటున్నారు. టీఆర్ఎస్‌ చీలిపోవడం ఖాయమనే భయంతోటే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని టీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే గతంలో కాంగ్రెస్ కూడా తమ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుందని, ఇప్పుడు సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం అయితే తప్పేంటని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అటు సీఎల్పీ విలీనాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని కోదండరామ్ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*