సల్మాన్‌కు-భారత్ సినిమా డైరెక్టర్‌కు చెడిందా?

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. తొలి రోజు ఓపెనింగ్స్‌లో సల్మాన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అంతేకాదు, దేశంలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించి మూడో చిత్రంగానూ సరికొత్త రికార్డు లిఖించిందీ చిత్రం.

రంజాన్ సందర్భంగా ఈ సినిమా ఇలా విడుదలైందో, లేదో- సల్మాన్‌కు చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కు మధ్య చెడిందన్న వార్త బాలీవుడ్‌ను ఊపేసింది. ‘భారత్’తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న అలీకి-సల్మాన్‌కు మధ్య ‘గ్యాప్’ వచ్చిందని, ఇద్దరి మధ్య చెడిందన్న రూమర్లు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

గాసిప్‌లకు ఫుల్‌స్టాప్ పడకపోవడంతో ఎట్టకేలకు అలీ అబ్బాస్ స్పందించాడు. ఆ వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదని, అవన్నీ గాలి వార్తలేనని కొట్టిపడేశాడు. నిజానికి మరో సినిమా గురించి సల్మాన్‌తో చర్చిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. సల్మాన్ తన పెద్దన్న లాంటివాడని చెప్పుకొచ్చాడు. తమ ఇంట్లోని వ్యక్తిగానే అందరూ తనను పరిగణిస్తారని పేర్కొన్నాడు. సల్మాన్‌తో మరో సినిమా తెరకెక్కించేందుకు చర్చలు కూడా జరుగుతున్నట్టు చెప్పాడు.

అలీ ఆ మాట అన్నాడో లేదో ఆ సినిమా ఇదేనంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. సల్మాన్ బ్లాక్ బస్టర్ సినిమా ‘టైగర్ జిందాహై’కి అది సీక్వెల్‌ అయి ఉండే అవకాశం ఉందంటూ రూమర్లు మొదలయ్యాయి. గతంలో ‘సుల్తాన్’, ‘టైగర్ జిందాహై’ సినిమాలకు ఇద్దరూ కలిసి పనిచేశారు. సుల్తాన్ రూ.300.45 కోట్లు వసూలు చేయగా, టైగర్ జిందా హై రూ. 339.16 కోట్లు వసూలు చేసింది. కాగా, భారత్ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.72 కోట్లకు పైగా వసూలు చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*