డబ్బులు కిందపడిపోతున్నాయంటూ రూ.1.10 లక్షలు కొట్టేసిన ఘనుడు!

జేబులోంచి డబ్బులు కిందపడిపోతున్నాయంటూ ఓ ద్విచక్ర వాహనదారుడి దృష్టి మళ్లించి రూ.1.10 లక్షలను చాకచక్యంగా కొట్టేశాడో దొంగ. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. ఇందిరానగర్‌కు చెందిన రమేశ్ (38) సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో క్యాష్ కలెక్షన్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం శ్రీనగర్‌కాలనీలోని ఓ వ్యక్తి నుంచి రూ.1.10 లక్షలు తీసుకుని బైక్‌పై బయలుదేరాడు.

అతడిని గమనించిన ఓ ఆగంతకుడు అతడిని వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లాక ప్లాన్ అమలు చేశాడు. జేబులోని డబ్బులు పడిపోతున్నాయని చూసుకోవాలని రమేశ్‌కు చెప్పాడు. దీంతో బైక్ ఆపిన రమేశ్ తన డబ్బులు చూసుకుంటుండగా ఆగంతకుడు వచ్చి ‘డబ్బులు ఎవరైనా జేబులో పెట్టుకుంటారా? డిక్కీలో పెట్టుకో’ అని సలహా ఇచ్చాడు. అక్కడితో ఆగక అతడే చొరవ తీసుకుని ఓ పేపర్‌లో ఆ డబ్బులు చుట్టి డిక్కీలో పెట్టాడు.

అతడి తీరుపై రమేశ్ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ‘నన్నే అనుమాస్తావా?’ అంటూ పేపర్‌ విప్పి డబ్బుల కట్ట చూపించి తిరిగి డిక్కీలో పెట్టాడు. ఈ క్రమంలో చాకచక్యంగా వ్యవహరించి డబ్బులు కొట్టేశాడు. అయితే, అనుమానం పోని రమేశ్ కాస్త దూరం వెళ్లి డిక్కీ తెరిచి చూడగా అందులో పేపర్ తప్ప డబ్బులు లేకపోవడంతో గతుక్కుమన్నాడు. మోసాన్ని గుర్తించి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*