విండీస్‌పై ఆడుతూ పాడుతూ విజయం సాధించిన ఇంగ్లండ్

సౌతాంప్టన్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్-విండీస్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కరీబియన్లు నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 44.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లిష్ బౌలర్ల దెబ్బకు విండీస్ మిడిలార్డర్ పేక మేడలా కుప్పకూలింది. క్రిస్ గేల్ (36), నికోలస్ పూరన్ (63), షిమ్రాన్ హెట్‌మెయిర్ (39) లు రాణించడంతో విండీస్ ఆ మాత్రం స్కోరైనా చేయగలింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్, మార్క్‌వుడ్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. జో రూట్ రెండు వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్, లియాం ప్లంకెట్ చెరో వికెట్ నేల కూల్చారు.

అనంతరం 213 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, జో రూట్‌లు అద్భుత శుభారంభాన్ని ఇచ్చారు. క్రీజులో పాతుకుపోయి విండీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యిలా మారారు. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెయిర్‌స్టో అవుటైనప్పటికీ క్రిస్ వోక్స్‌తో కలిసి రూట్ జట్టును విజయం దిశగా ముందుకు తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో 40 పరుగులు చేసిన వోక్స్ అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 94 బంతులు ఎదుర్కొన్న రూట్ 11 ఫోర్లతో అజేయంగా 100 పరుగులు చేశాడు. బెన్‌స్టోక్స్ 10 పరుగులు చేశాడు. దీంతో 33.1 ఓవర్ల లోనే ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది.సెంచరీతో జట్టును గెలిపించిన రూట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*