తెలంగాణలో పులుల సంఖ్య పెరగడంపై ఇంద్రకరణ్ రెడ్డి హర్షం

హైదరాబాద్:తెలంగాణ రాష్టంలో పులుల సంఖ్య పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణ అడవుల్లో 26 పులులున్నట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. గతంలో 20 పులులు ఉన్నట్లు ఓ అంచనా ఉండేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ చేపట్టిన అటవీ రక్షణ చర్యలే పులుల సంఖ్య పెరిగేందుకు దోహద పడ్డాయని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వేట, అడవుల నరికివేత, ఆవాసాల విధ్వంసం, పర్యావరణ మార్పులు, మనిషి-పులుల మధ్య ఘర్షణ తదితర కారణాల వల్ల పులులు, ఇతర వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వాటిని కాపాడుకోవడానికి అందరూ మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ, అటవీ సంరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

తెలంగాణలో ఉన్న రెండు పులుల సంరక్షణ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం మంచి రేటింగ్‌ ఇచ్చిందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించడం గొప్ప విషయమన్నారు. వన్యప్రాణుల రక్షణ, ఆవాస ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*