*ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూత*

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నటుడు దేవదాస్‌ కనకాల కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్‌ కనకాల.. 1945 జులై 30న యానాంలో జన్మించారు. దేవదాస్‌ కనకాలకు కుమారుడు రాజీవ్‌ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. ఇటీవలే దేవదాస్‌ కనకాల భార్య లక్ష్మీదేవి మృతి చెందారు.

విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో దేవదాస్ ఒకరు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోను అధ్యాపకునిగా, తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌ పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే.

దేవదాస్ కనకాల కుమారుడు రాజీవ్ కనకాల ప్రముఖ నటుడు. యాంకర్ సుమ కోడలు. ఇటీవలే దేవదాస్ కనకాల భార్య కన్నుమూశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*