సుస్వ‌రాల వేడుక‌లో ‘తూనీగ’

హైద్రాబాద్: ఓ సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చిన తాను, శ్రీ‌కాకుళం దారుల నుంచి ఇక్క‌డిదాకా ప్ర‌యాణించిన క్ర‌మాన ఎన్నో అవ‌స్థ‌లు, ఆటుపోట్లు దాటుకుని వ‌చ్చాన‌ని భావోద్వేగ భ‌రితంగా తూనీగ ద‌ర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ స్పందించారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌, రామానాయుడు స్టూడియోలో తూనీగ చిత్ర స్వ‌రాల వేడుక‌ను యూనిట్ స‌భ్యుల కుటుంబ స‌భ్యులు, ఇతర సినీ అభిమానుల కేరింతల న‌డుమ నిర్వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.ఇటీవ‌ల విడుద‌ల‌యిన చిన్న చిత్రాలన్నీ బాక్సాఫీసుకు బొనాంజాగా నిలిచాయ‌ని, అదే క్ర‌మంలో ఈ సినిమా చేరాల‌న్న‌ది త‌న అభిమ‌తం అన్నారు. త‌న‌కూ ఉత్త‌రాంధ్ర నేల‌తో మంచి అనుబంధం ఉంద‌ని గుర్తుచేసుకున్నారు. నాన్న స‌ద్గురు శివానంద‌మూర్తి ఆశ్ర‌మం విశాఖ జిల్లా, భీమునిప‌ట్నం, ఆనంద‌వ‌నంలో ఉంద‌ని, ఆ నేల అంటే త‌మ‌కెంతో ఇష్ట‌మ‌ని, మ‌రో మారు త‌న తండ్రి అయిన స‌ద్గురువును స్మ‌రించుకున్నారు.

చింత‌ల‌న్నీ.. వెత‌ల‌న్నీ తీర్చే సినిమా కావాలి: మ‌రుధూరి
సీనియ‌ర్ డైలాగ్ రైట‌ర్ మ‌రుధూరి రాజా మాట్లాడుతూ.. ఉత్త‌రాంధ్ర అంటే ఉద్య‌మాల గ‌డ్డ అని, అలాంటి నేల నుంచి వ‌చ్చిన దర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ ఈ చిత్రం కోసం ఎంతో క‌ష్టించార‌ని, ఎన్నో అవ‌స్థ‌లూ, ఆటుపోట్లూ ఎదుర్కొన్నార‌ని, ఈ వేళ ఈ స్వ‌రాల పండుగ‌లో ఆ క‌ష్టం అంతా మ‌రిచి, తొలి ప్ర‌య‌త్నంతోనే విజ‌యం సాధించాల‌ని దీవించారు. ముందున్న కాలాన మ‌రిన్ని చిత్రాలు తీసేందుకు స‌న్న‌ద్ధం కావాల‌ని సూచించారు. ప్ర‌చార చిత్రాలు విడుద‌ల అయిన నాటి నుంచి సామాజిక మాధ్య‌మాల్లో చిత్రంపై మరింత ఆస‌క్తి పెరిగింద‌ని, చిత్ర ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వర్తిస్తూ, క్రియేటివ్ రైటింగ్స్ అందించిన వ‌ర్థ‌మాన ర‌చ‌యిత ర‌త్న‌కిశోర్ శంభు మహంతి త‌న‌కు అత్యంత ఆప్తుడ‌ని, సోదర స‌మానుడని అన్నారు. ఆన్ లైన్ మాధ్య‌మాల్లో ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి చ‌ర్చ న‌డుస్తోంద‌ని, అందుకు ఓ కార‌ణం అన్ని మీడియాలూ అందించిన గొప్ప స‌హాకారమేన‌ని, చిన్న చిత్ర‌మే అయినా, ఇది ఎన్నో చింత‌లు తీర్చే చిత్రం కావాల‌ని ఆకాంక్షించారు. ఎంద‌రో జీవితాలు ముడిప‌డి ఉన్న చిత్రంగా ఇది రూపొందిందని, వారి రంగుల కలలు ఈ రంగులో లోకాన ఫ‌లిస్తే తానెంతో ఆనందిస్తాన‌ని అన్నారు. ఉత్త‌రాంధ్ర నేలతో మా అన్న‌య్య, ర‌చ‌యిత ఎంవీఎస్ హరనాథ‌రావుకు కూడా ఎంతో అనుబంధం ఉన్న రీత్యా ఇది త‌న కుటుంబ పండుగ అని వ్యాఖ్యానించి చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*