అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రముఖ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ నేడు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అమిత్‌షాకు వివేక్ శాలువా కప్పి సత్కరించారు. అమిత్‌షాను కలవడానికి ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్‌తో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో వివేక్ భేటీ అయ్యారు. వివేక్‌తో పాటు ఇతర బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు.

వివేక్ గతంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా వీరి సోదరులు జి వినోద్ చెన్నూరు శాసనసభ్యునిగా మంత్రిగా వ్యవహరించారు. కాకా తనయునిగా గుడిసెల వెంకటస్వామి తనయుడిగా సింగరేణి ప్రాంతాలు అయినటువంటి రామగుండం, పెద్దపల్లి ,గోదావరి ఖనీ, మంచిర్యాల, మందమర్రి, చెన్నూరు ,బెల్లంపల్లి తదితర నగరాల్లో వీరి కార్యకర్తలు ఉన్నారు. అతి త్వరలో వీరందరూ బీజేపీలో చేరనున్నారు. ప్రధాని మోదీ నిర్ణయాలను చూసి ఇంకా చాలా మంది బీజేపీలో చేరుతారని చెప్పారు.

బీజేపీలో చేరిన అనంతరం వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌‌పై విమర్శలు చేశారు. ఆయన నియంతృత్వ ధోరణికి బీజేపీ బుద్ధి చెబుతుందన్నారు. తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంపైనే సీఎం ప్రధానంగా దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అవినీతి భారీగా పెరిగిపోయిందని, ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా ముఖ్యమంత్రి నెరవేర్చలేదని మండిపడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*