జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్: అల్లం నారాయణ

అర్హత గల జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులను జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

గురువారంనాడు సమాచార భవన్ లోని బోర్డురూమ్ లో రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన అక్రెడిటేషన్ కమిటీ సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. దాదాపు 80 శాతం మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వడానికి కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 17 వేల మంది జర్నలిస్టులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. నూతన అక్రెడిటేషన్ కార్డులు ఈ అక్టోబర్ నెల నుండి 2021 సెప్టెంబర్ వరకు మనుగడలో ఉంటాయని తెలిపారు. ఈ దఫా తొలిసారిగా అక్రెడిటేషన్ కార్డులను ఆన్ లైన్ ప్రక్రియలో చేపట్టినట్లు తెలిపారు. ఆన్ లైన్ ప్రక్రియ వల్ల అక్రెడిటేషన్లలో పూర్తి పారదర్శకత పాటించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జర్నలిస్టులకు అత్యధికంగా అక్రెడిటేషన్ల సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది అన్నారు. మహిళా జర్నలిస్టులకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని, వారికి కేటాయించిన రిజర్వేషన్లు మహిళా జర్నలిస్టులు లేనట్లైతే అట్టి ఖాళీలను భర్తీ చేయబోమని స్పష్టం చేశారు. ఆన్ లైన్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీ రెండవ సమావేశం సెప్టెంబర్ లో జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోని అర్హత గల జర్నలిస్టులు వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని చిట్టచివరి జర్నలిస్టు వరకు కార్డులు ఇస్తామని తెలిపారు. జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామని తెలంగాణ జర్నలిస్టులకు ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు. డిల్లీస్థాయిలో పని చేసే జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ నమోదులో సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. జర్నలిస్టుల సౌకర్యార్థం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ఇక నుండి ఫోటోగ్రాఫర్లను ఫోటో జర్నలిస్టుగా, వీడియో గ్రాఫర్లను వీడియో జర్నలిస్టుగా వ్యవహరించాలని కమిటీ సూచించింది.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులు విరాహత్ అలీ, బసవ పున్నయ్య, కట్టా కవిత, సౌమ్య, వి. సతీష్, కోటిరెడ్డి, ప్రకాశ్, గంగాధర్, కిరణ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య, మీడియా అకాడమీ కార్యదర్శి ఎస్. విజయ్ గోపాల్, జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, అసిస్టెంట్ డైరెక్టర్ హష్మి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*